: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ దస్త్ర్రానికి రాష్ట్రపతి ఆమోదం

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, ఉపాధ్యాయులందరికీ ఓకే రకమైన సర్వీస్ రూల్స్ కల్పించే దస్త్రానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ దస్త్రంపై ఈ రోజు ఆయన సంతకం చేశారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వచ్చే సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల ఏకీకృత దస్త్రానికి ఆమోదం తెలపడం ద్వారా ఇకపై పంచాయతీ రాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన సర్వీస్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.

కాగా, ఈ దస్త్రం అమలుకు సంబంధించి నెలకొన్న సమస్యలను న్యాయశాఖ పరిశీలించి అనుమతివ్వగానే కేంద్ర హోం శాఖ కార్యదర్శి సంతకం పెట్టారు. అనంతరం హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాలను సంప్రదించడం జరిగింది. అలాగే, ఈ ఫైల్ ను ప్రధాని మోదీ కార్యాలయానికి పంపడానికి ముందు, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ కు ఉన్న ప్రాధాన్యతను రాజ్ నాథ్ కు వివరించడం జరిగింది.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, వెంకయ్యనాయుడు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న హోం శాఖ నేతృత్వంలోని కమిటీ ఆ ఫైల్ ను క్లియర్ చేసిన అనంతరం, ప్రధాని కార్యాలయానికి పంపింది. నిన్న సాయంత్రం ప్రధాని మోదీ ఈ దస్త్రంపై సంతకం చేశారు. అనంతరం, ఈ దస్త్రం రాష్ట్రపతి భవన్ కు చేరగా, దీన్ని పరిశీలించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సంతకం చేశారు.

More Telugu News