: ఎయిరిండియా ప్రస్థానం ఇది.... సంస్థను ఆరంభించిన టాటాల చెంతకే చేరనుందా?

భారతదేశానికి తలమానికంగా నిలిచిన టాటా గ్రూప్‌ స్వాతంత్ర్యానికి పూర్వమే మొట్టమొదటి ఎయిర్‌ లైన్స్‌ కంపెనీని స్థాపించింది. టాటా ఎయిర్‌ లైన్స్‌ పేరుతో జేఆర్‌డీ టాటా దానిని నెలకొల్పారు. ముంబై–కరాచీ నగరాల మధ్య టాటాల తొలి విమానం గాల్లోకి ఎగరగా, దానిని స్వయంగా జేఆర్డీ టాటా నడపడం విశేషం. అయితే, 1948 తర్వాత విదేశీ సర్వీసులను ప్రారంభించేందుకుగాను ప్రభుత్వం, ప్రైవేటు రంగంలో భాగస్వామ్యం ద్వారా టాటా ఎయిర్ లైన్స్ ను ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ గా మార్చారు.

1953లో విమానయాన వ్యాపారాలన్నింటినీ జాతీయం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎయిరిండియా ఇంటర్నేషనల్ లో వాటా టాటాల చేజారింది. ఈ నిర్ణయాన్ని జేఆర్డీ టాటా వ్యతిరేకించారు. అయితే అప్పటి ప్రధాని నెహ్రూ ఒత్తిడితో ఎయిరిండియా ఇంటర్నేషనల్ కు 1977 వరకు ఆయన ఛైర్మన్  గా వ్యవహరించారు. ఆ సమయంలో ఎయిరిండియా పనితీరు అద్భుతమనే చెప్పాలి. ఉద్యోగుల్లో నిబద్ధతతో సంస్థకు తిరుగులేని పేరుప్రతిష్ఠలు వచ్చాయి. 1977లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ ఎయిరిండియా ఛైర్మన్ పదవి నుంచి జేఆర్డీ టాటాని తొలగించడంతో ఎయిరిండియాతో టాటాల బంధం పూర్తిగా తెగిపోయింది.

ఎయిర్ లైన్స్ లో ప్రైవేటు సంస్థల జోరు పెరగడంతో ఎయిరిండియా చతికిలబడింది. ప్రైవేటు సంస్థల సేవలతో పాటు డిస్కౌంట్‌ ఆఫర్లు కూడా ప్రయాణికులను అలరించడంతో ఎయిరిండియా ఎక్కేవారు లేకుండా పోయారు. దీంతో ఎయిరిండియా 50,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. ఇందులో సుమారు 28,000 కోట్ల రూపాయలు వర్కింగ్‌ కేపిటల్‌ రుణాలేనంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ మొత్తం అప్పుకి వడ్డీ భారం 4,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా 2007 తరువాత ఎయిరిండియా ఏనాడూ లాభాల చవిచూడలేదు. దీంతో పదేళ్ల క్రితం దేశీ విమానయాన మార్కెట్లో 35 శాతం కలిగిన ఎయిరిండియా వాటా ఇప్పుడు కేవలం 14 శాతానికి పడిపోయింది. దీంతో ఇండిగో (40 శాతం మార్కెట్‌ వాటా), జెట్‌ ఎయిర్‌ వేస్‌ (16 శాతం మార్కెట్‌ వాటా) తరువాతి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలో 51 శాతాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో దానిని కొనుగోలు చేసి, తాము ప్రారంభించిన వ్యాపారాన్ని మళ్లీ లాభాల బాటపట్టించాలని టాటాలు భావిస్తున్నారు.

More Telugu News