: వేడికి తట్టుకోలేక తలపై నీరు చల్లుకుంటే, నీరు తాగావంటూ విలేకరిని చితకబాదారు!

పవిత్ర రంజాన్ మాసంలో రోజువారీ ఉపవాస దీక్ష ముగియకుండానే నీరు తాగాడని ఆరోపిస్తూ, ఓ విలేకరిని పాకిస్థాన్ లోని ఓ మసీదులో చావగొట్టారు. ఈ ఘటన దేశ రాజధాని ఇస్లామాబాద్ లో కలకలం రేపింది. హక్కానియా మదారసాకు చెందిన విద్యార్థులు మీడియా ప్రతినిధిని కొట్టారని 'డాన్' పత్రిక కథనాన్ని ప్రచురించింది.

'దిన్ న్యూస్' బృందంలోని ఓ వ్యక్తి నీరు తాగాడని విద్యార్థులు ఆరోపిస్తుండగా, తాము ఓ ఇంటర్వ్యూ నిమిత్తం వచ్చామని, వేడికి తట్టుకోలేక తమ కెమెరామెన్ రషీద్ అజీమ్, మసీదులోని నీటి కొలను వద్ద తలను తడుపుకున్నాడని, అంతలోనే చుట్టుముట్టిన పలువురు నీరు ఎందుకు తాగావని ప్రశ్నిస్తూ దాడికి దిగారని చానల్ రిపోర్టర్ అలీ ఉస్మాన్ వెల్లడించాడు. మదారసాలో కరెంటును దొంగతనంగా వాడుతున్నారని తాము గమనించి, దాన్ని వీడియో తీస్తున్నందుకే ఈ దాడి చేశారని ఆరోపించారు. ఆపై విద్యార్థులు రాళ్లదాడికి దిగారని, తమ కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. జరిగిన ఘటనపై ఇరు పక్షాల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

More Telugu News