: ఇండియన్ అంబాసిడర్ గా తనకు అత్యంత సన్నిహితుడిని నియమించిన ట్రంప్

తనకు అత్యంత సన్నిహితుడు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల కమిటీ డిప్యూటీ అసిస్టెంట్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ కెన్నీత్ ఐ జస్టర్ ను భారత రాయబారిగా నియమించాలని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ నేడు వెల్లడించింది. ప్రస్తుతం భారత రాయబారిగా ఉన్న రిచర్డ్ వర్మ స్థానంలో 62 సంవత్సరాల జస్టర్ నియమితులు కానున్నారని, ఆయన నామినేషన్ ను సెనేట్ ఖరారు చేయాల్సి వుందని సైట్ హౌస్ ప్రతినిధి లిండ్సే ఈ వాల్టర్స్ తెలిపారు.

ఇండియన్ అంబాసిడర్ పదవికి ఆయన సరైన వ్యక్తని, వైట్ హౌస్ లోని అందరితో సత్సంబంధాలు కలిగివుండటం భారత్ కు మేలును కలిగిస్తుందని 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. జస్టర్ నియామకాన్ని యూఎస్ లో భారత నిపుణుడు ఆష్లే టెలిస్ స్వాగతించారు. ఇప్పటికే ఇండియా, అమెరికాల మధ్య ఎన్నో ద్వైపాక్షిక చర్చల్లో ఆయన పాలు పంచుకున్నారని గుర్తు చేశారు. కాగా, జస్టర్ నియామకంపై సెనేట్ నిర్ణయం తరువాత అధికారిక ప్రకటన వెలువడనుంది.

More Telugu News