: సమ్మె ఎఫెక్ట్.. డార్జిలింగ్‌లో గ్యాస్ సిలిండర్ రూ.1500.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న వైనం!

గూర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం డార్జిలింగ్‌లో పోరాటం ఉద్ధృతమైంది. గత 13 రోజులగా డార్జిలింగ్ వాసులు సమ్మె పాటిస్తున్నారు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. దీనికి తోడు ఎడతెగకుండా కురుస్తున్న వర్షం కూడా జనాలను బయటకు రానీయడం లేదు. ఫలితంగా నగరం బోసి పోయినట్టు కనిపిస్తోంది. ప్రత్యేక గూర్ఖాల్యాండ్ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని డార్జిలింగ్ వాసులు తెగేసి చెబుతున్నారు.

కాగా, సమ్మె కారణంగా డార్జిలింగ్‌లో వంటగ్యాస్ సిలిండర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఒక్కో సిలిండర్‌ను రూ.1200-1500కు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాము స్థానిక ఆహారంతోనే సరిపెట్టుకుంటున్నా వంటకు మాత్రం గ్యాస్ అవసరం కాబట్టి ధర ఎంతైనా కొనుక్కోక తప్పడం లేదని ఓ మహిళ పేర్కొంది. సమ్మె కారణంగా డార్జిలింగ్‌లోని హోటళ్లు, షాపులు, అన్ని సంస్థలు మూతపడడంతో రోడ్లపై కుర్రాళ్లు క్రికెట్, ఫుట్‌బాల్ తదతర ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘‘మా స్కూళ్లు మూతపడ్డాయి. మేం చేసేందుకు ఏమీ లేదు. అందుకే ఇంటి వద్దే ఆటలాడుకుంటున్నాం’’ అని ఐదో తరగతి విద్యార్థి ఒకరు తెలిపాడు.

More Telugu News