: యోగే డే రోజున భారత్‌కు సొంతమైన 24 ప్రపంచ రికార్డులు.. బాబా రాందేవ్ వెల్లడి

ప్రపంచ యోగా దినోత్సవాన భారత్ 24 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నట్టు యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. యోగా డేను విజయవంతం చేసినందుకు కృషి చేసిన బీజేపీని ప్రశంసించిన ఆయన మాట్లాడుతూ బీజేపీ చీఫ్ అమిత్ షా దిశానిర్దేశం, గుజరాత్ ప్రభుత్వ సహకారంతో యోగా డే విజయవంతమైందని, 24 రికార్డులు నెలకొల్పిందని అన్నారు. యోగా అనేది భారత సంస్కృతిలో ఓ భాగమన్నారు. త్వరలోనే తాను యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా, కెనడాలో పర్యటించనున్నట్టు తెలిపారు.

కాగా, ప్రభుత్వ సహకారంతో బాబా రాందేవ్ దేశవ్యాప్తంగా వచ్చే 3-5 ఏళ్లలో 11 లక్షల యోగా క్లాసులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యోగా ఇంత విజయం సాధిస్తుందని తానెప్పుడూ ఊహించలేదని రాందేవ్ పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం సూరత్‌లో యోగా క్యాంప్ నిర్వహించినప్పుడు అది ఇంత భారీ స్థాయికి చేరుకుంటుందని ఊహించలేదన్నారు. తాజాగా బుధవారం నిర్వహించిన యోగాడేలో 3 లక్షల మంది పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించారు.

More Telugu News