: వెలుగులోకి కొత్త విషయం.. ఆరు నెలల క్రితమే కుంబ్లే, కోహ్లీ మధ్య మాటలు బంద్!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న అనిల్ కుంబ్లే వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వారిద్దరి మధ్య ఆరు నెలల క్రితమే మాటలు మూగబోయినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. సమస్య పరిష్కారం కోసం రంగంలోకి దిగిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌‌లతో కూడిన  చీఫ్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ).. కోచ్ పదవి పొడిగింపు విషయంలో కుంబ్లేకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. అపరిష్కృతంగా ఉన్న విషయాలు పరిష్కారమయ్యే వరకు ఆయనను కొనసాగించాలని మాత్రమే సీఏసీ కమిటీ పేర్కొన్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఇక చాంపియన్స్ ట్రోపీ ఫైనల్‌కు ముందు భారత జట్టు బస చేసిన హోటల్‌లో వేర్వేరుగా మూడు సమావేశాలు జరిగాయి. మొదట కుంబ్లే బీసీసీఐ ఉన్నతాధికారులను కలవగా, ఆ తర్వాత వారితో కోహ్లీ సమావేశమయ్యాడు. గతేడాది డిసెంబరులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ తర్వాత కుంబ్లే, కోహ్లీ మధ్య మాటలు బంద్ అయినట్టు తెలిసి షాక్‌కు గురైనట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వరకు వారు మాట్లాడుకోలేదని పేర్కొన్నారు. కోహ్లీతో ఏమైనా సమస్యలున్నాయా? అని కుంబ్లేను ప్రశ్నిస్తే, అటువంటిదేమీ లేదని ఆయన చెప్పాడని తెలిపారు. అయితే కొన్ని విషయాల్లో సమస్యలున్నా అవి అర్థం లేనివని, వాటివల్ల సమస్యలేదని కుంబ్లే వివరించినట్టు ఆయన తెలిపారు.

More Telugu News