: నౌకాదళం చరిత్రలో మైలురాయి... తేలియాడే ఓడరేవు ప్రారంభం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలియాడే ఓడరేవు సేవలు భారత నౌకాదళానికి అందుబాటులోకి వచ్చాయి. తమిళనాడు కట్టుపల్లిలోని లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ షిప్ యార్డులో భారత నావీ యుద్ధనౌకల తయారీ విభాగం కంట్రోలర్ వైస్ అడ్మిరల్ డీఎం దేశ్ పాండే సతీమణి అంజలీ దేశ్ పాండే, ఈ తేలియాడే వంతెనకు కుంకుమ తిలకం దిద్ది పూజలు చేసి జాతికి అంకితం చేశారు. 55 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మితమైన ఇది సముద్రంలో ప్రయాణిస్తూ, అవసరమైన చోట ఆగి, యుద్ధ నౌకలకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు, 8 వేల టన్నుల వరకూ సరకును మోస్తూ, వాటిని వివిధ నౌకల్లోకి ఎక్కించగలుగుతుంది.

ఈ ఫ్లోటింగ్ డాక్ అందుబాటులోకి రావడం నౌకాదళ చరిత్రలో మైలురాయని, ఈ ఓడరేవుపై నౌకలకు కావాల్సిన మరమ్మతులు సైతం చేసుకోవచ్చని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దీన్ని నేవీకి అందించే ముందు కొన్ని ట్రయల్స్ నిర్వహించనున్నట్టు లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. ఇండియా నుంచి అండమాన్ నికోబార్ దీవుల మధ్య ప్రయాణించే నౌకలకు అవసరమైన సేవలను ఇది అందిస్తుందని పేర్కొంది. 185 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ కృత్రిమ ఓడరేవును రక్షణ శాఖ ఆదేశాలతో రూ. 468 కోట్ల వ్యయంతో మే 2015లో నిర్మాణాన్ని ప్రారంభించి, అనుకున్న సమయానికి పూర్తి చేశామని ఎల్అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.

More Telugu News