: పాక్ నెత్తిన పాలుపోసిన చైనా.. రూ.90 వేల కోట్ల ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు!

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ (సీపీఈసీ)తో పాక్‌ను బలమైన మిత్రదేశంగా మలుచుకున్న చైనా తాజాగా పాకిస్థాన్‌కు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సింధు నదిపై పాక్ నిర్మించ తలపెట్టిన డ్యామ్ ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని పాక్ అధికారిక రేడియో ప్రకటించింది.

డైమెర్-బాషా డ్యామ్ పేరుతో సింధు నదిపై భారీ ప్రాజెక్టుకు పాక్ ప్రణాళిక సిద్ధం చేసింది. పునాది రాయి కూడా వేసింది. అయితే భారత్ అభ్యంతరాల నేపథ్యంలో దానికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు నిరాకరించగా ఆ తర్వాత ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కూడా నిధులు ఇచ్చేందుకు తిరస్కరించింది. దీంతో రూ.90 వేల కోట్ల (14 బిలియన్ డాలర్లు) అంచనాలతో ప్రారంభించిన ఈ డ్యామ్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే తాజాగా మిత్రదేశానికి చైనా బంపరాఫర్ ప్రకటించింది. సీపీఈసీలో భాగంగా ఆ ప్రాజెక్టును నిర్మిస్తామంటూ ముందుకొచ్చింది. దీంతో పాక్ ఉబ్బతబ్బిబ్బవుతోంది.

డైమెర్-బాషా డ్యామ్‌ను గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో సింధునదిపై నిర్మించేందుకు పాక్ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2006లో దీనిని ప్రకటించింది. 2011లో పునాది రాయి వేసింది. ఈ డ్యామ్ ప్రాజెక్టు ద్వారా 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రచించింది. నిధుల కోసం ప్రపంచబ్యాంకు, ఏడీబీలను అభ్యర్థించింది. అయితే ఈ డ్యామ్ నిర్మించనున్న ప్రాంతం కశ్మీర్‌లో అంతర్భాగమని భారత్ తొలి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

 దీంతో భారత్ నుంచి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ తీసుకొస్తేనే రుణం మంజూరు చేస్తామని ప్రపంచ బ్యాంకు పాక్‌కు తేల్చి చెప్పింది. పాక్ ఇప్పటి వరకు భారత్‌ను ఆ సర్టిఫికెట్ గురించి అడగలేదు. దీంతో నిధులు ఇచ్చేందుకు రెండేళ్ల క్రితమే  ప్రపంచబ్యాంకు నిరాకరించింది. గత నవంబరులో ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా రుణం ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా చైనా ఈ బిలియన్ డాలర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చినట్టు పాక్ పేర్కొంది.

More Telugu News