: డొనాల్డ్ ట్రంప్ పక్కనే సత్య నాదెళ్ల... కీలక చర్చలు!

అమెరికన్లకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన డిజిటల్ సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆపిల్, అమేజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తదితర సిలికాన్ వ్యాలీ దిగ్గజాలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమై ప్రత్యేక చర్చలు సాగించిన వేళ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ట్రంప్ పక్కపక్కనే కూర్చుని పలు అంశాలపై చర్చలు జరిపారు. పాతబడిపోయిన ఫెడరల్ వెబ్ సైట్లను ఆధునికీకరించడం నుంచి, వయోవృద్ధులకు ఆరోగ్య పథకాలను దగ్గర చేయడం వరకూ వివిధ అంశాలపై చర్చలు జరిగాయి.

సోమవారం నాడు జరిగిన ఈ సమావేశానికి యాపిల్ చీఫ్ టిమ్ కుక్, అమేజాన్ సీఈఓ జెఫ్రీ పీ బెజోస్, గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ స్కిమిడ్త్ తదితరులు ఈ సమావేశానికి రాగా, ఫేస్ బుక్ నుంచి మాత్రం ఎవరూ హాజరు కాలేదు. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేటు సెక్టారులో ఉద్యోగాలు తదితర అంశాలనూ వీరు చర్చించినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. వెబ్ సైట్ లను ఆధునికీకరించడం ద్వారా వచ్చే పదేళ్లలో ట్రిలియన్ డాలర్లను ఆదా చేసుకోవచ్చని భావిస్తున్న ట్రంప్, అందుకు తీసుకోవాల్సిన చర్చలపై టెక్ దిగ్గజాలను సలహాలు, సూచనలు అడిగారని వెల్లడించారు.

More Telugu News