: జకీర్ నాయక్‌కు లెబనాన్‌లో షాక్.. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం!

వివాదాస్పద ముస్లిం మత బోధకుడు జకీర్ నాయక్‌కు లెబనాన్‌లో పెద్ద షాక్ తగిలింది. దేశంలోకి అడుగుపెట్టకుండా జకీర్‌పై నిషేధం విధించాలంటూ లెబనాన్‌లో హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారోద్యమానికి తెరతీశారు. స్థానిక మత పెద్ద ఒకరు జకీర్‌ను ఆహ్వానించి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఆయన లెబనాన్‌ సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జకీర్‌ను ఉగ్రవాదిగా, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తిగా పేర్కొంటూ ఆందోళన చేపట్టారు. పలు సంస్కృతుల సమ్మేళనమైన లెబనాన్‌కు ఆయన రాక చేటు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. జకీర్ నాయక్ ఒక అతివాద మతబోధకుడని, అతడు తన రెచ్చగొట్టే ప్రసంగాలతో ముస్లిమేతర, ఆధునిక ముస్లింలపై దాడులకు రెచ్చగొడతాడని వారు ఆరోపిస్తున్నారు.

ఆయనను చాలా దేశాలు నిషేధించాయని మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది ఖాలెద్ మెర్హబ్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు తమకు జకీర్ ప్రసంగాలే స్ఫూర్తి అని చెప్పడంతో ఆయన చుట్టూ వివాదం రాజుకుంది. ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధమైన వేళ గతేడాది జూలై 1న భారత్ విడిచి పారిపోయారు. మనీ లాండరింగ్ సహా పలు విషయాల్లో ఆయనపై భారత్‌లో విచారణ జరుగుతోంది. ఆయనను తిరిగి భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జకీర్ నాయక్ సౌదీ అరేబియా, యూఏఈ, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

More Telugu News