: కోవింద్ గ్రామంలో ముందే దీపావళి.. సంబరాల్లో మునిగిపోయిన ప్రజలు!

ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని పారౌఖ్ గ్రామంలో దీపావళి చాలా నెలల ముందే వచ్చేసినట్టుగా వుంది. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన వెంటనే ఇక్కడి ప్రజలు ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. సంబరాల్లో మునిగిపోయారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలను ప్రశంసిస్తూ పాటలు పాడుతున్నారు. కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే గ్రామస్తులు వారి ఇళ్లకు వెళ్లి హార్మోనియంలు, ఢోలక్‌లతో బయటకు వచ్చి కోవింద్ పూర్వీకుల ఇంటి సమీపంలోని పోడియం వద్దకు చేరుకుని  పాటలతో హోరెత్తించారు.

తమ గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్రపతి రేసులో ఉండడం తమకు గర్వకారణమని, చివరి ఫలితాలు వచ్చే వరకు ఈ సంబరాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా కోవింద్ చిన్ననాటి స్నేహితుడు జశ్వంత్ సింగ్ తెలిపారు. ఈ చిన్న గ్రామానికి ఇప్పుడు ప్రపంచ  పటంలో చోటు లభించిందని ఆయన ఉప్పొంగిపోతున్నారు. అప్పట్లో తామిద్దరం స్కూలుకు కలిసి వెళ్లేవారమని, చదువులో ఆయన చాలా చురుకైన వాడని తెలిపారు. అప్పట్లో టీచర్లు చాలా కఠినంగా ఉండేవారని, విద్యార్థులను చితకబాదేవారని గుర్తు చేసుకున్నారు. అయినా రామ్‌నాథ్ ఏనాడూ టీచర్లను ద్వేషించలేదని వివరించారు.

కోవింద్ చాలా వినయపూర్వకంగా, సామాన్య వ్యక్తిలా ఉంటారని, గవర్నర్ అయ్యాక ఓసారి గ్రామానికి వచ్చి తమందరినీ కలుసుకున్నారని చదువులో ఆయన సీనియర్ రాజ్‌కిషోర్ సింగ్ తెలిపారు. తన ఇంటిని ఆయన గ్రామానికి బహుమానంగా ఇచ్చేశారని, ప్రస్తుతం దానిని కమ్యూనిటీ  హాల్‌గా ఉపయోగించుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇలా కోవింద్ చిన్ననాటి స్నేహితులందరూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు.

More Telugu News