: బాలునిపై హింస...నాలుకపై కొడవలితో గాట్లు పెట్టి చిత్రహింసలు!

సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పదవ తరగతి 8.5 పాయింట్లతో పాసైన తెలివైన విద్యార్థి 30 వేల అప్పుకు చిత్రహింసలపాలైన ఘటన చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.... మేడాపురం గ్రామానికి చెందిన మల్లి అనే వ్యక్తి నుంచి ముత్యాలప్ప, నాగమ్మ దంపతులు 30,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. మల్లి అప్పుతీర్చమని గొడవచేయడంతో అప్పు తీర్చలేకపోయిన ముత్యాలప్ప పదోతరగతి చదువుతున్న తన కుమారుడు ఆదినారాయణ (16) ను మల్లి వద్ద గొర్రెలు మేపేందుకు పెట్టాడు.

 ఐదు నెలలపాటు ఆదినారాయణ గొర్రెలు మేపాడు. ఇంతలో పదవ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. అందులో ఆదినారాయణ 8.5 పాయింట్లతో పాస్ అయ్యాడు. ఐదునెలలపాటు గొర్రెలు మేపడంతో 15,000 రూపాయల అప్పు తీరింది. మిగిలిన 15,000 రూపాయలు మరో చోట వడ్డీకితెచ్చి ముత్యాలప్ప అప్పుతీర్చేశాడు. దీంతో తన కుమారుడ్ని వదిలేయాలని మల్లిని కోరాడు. అయితే ఆదినారాయణ గొర్రెలు మేపేటప్పుడు 5 గొర్రెలు తప్పిపోయాయని, అందుకు మరికొంత కాలం తమవద్దే ఉంచుకుంటామని చెప్పడంతో మారు మాటాడలేక ముత్యాలప్ప వెళ్లిపోయారు.

అయితే గొర్రెలు పోగొట్టాడంటూ ఆదినారాయణను గదిలో నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశాడు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ చిత్రహింసలు కొనసాగాయి. ఆదివారం సాయంత్రం ఆదినారాయణను తీసుకెళ్లమంటూ కబురురావడంతో కుమారుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడిని చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. బాలుడి కాళ్లు చేతులు వాచిపోయాయని తెలిపారు. మర్మాంగంపై కొట్టారని, నాలుకపై కొడవలితో గాట్లు పెట్టారని తెలిపారు. దీంతో ముత్యాలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ధర్మవరం పోలీసులు, చెన్నేకొత్తపల్లి పోలీసులకు దర్యాప్తు చేయాలని సమాచారం అందించారు.

More Telugu News