: పవన్ కల్యాణ్ హిందీలో పలకరించారు.... నేను తెలుగువాడ్ని అనగానే ఎంతగానో ఆదరించారు!: అడవి శేష్

అమెరికాలో ‘కర్మ’ సినిమా తీసి, తెలుగులో దానిని విడుదల చేసేందుకు నానా తంటాలు పడిన అడివి శేష్... తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నాడు. 'అమీ తుమీ' సినిమా ప్రమోషన్ సందర్భంగా శేష్ మాట్లాడుతూ, తన అసలు పేరు సన్నీచంద్ర అని చెప్పాడు. తన నాయనమ్మపేరు శేషగిరీశ్వరి అని... ఆమె పేరు కలిసి వచ్చేలా శేష్ అని సినిమాల కోసం మార్చుకున్నానని చెప్పాడు. మొదట్లో అమెరికాలో సంపాదించిన డబ్బులతో హైదరాబాదు నుంచి ముంబైకి విమానాల్లో తిరిగానని, ఒంటరిగా సినిమాను విడుదల చేసుకోవాలనే ప్రయత్నంలో జేబులు ఖాళీ అవ్వడంతో ఆ తర్వాత నుంచి ట్రైన్ లో వెళ్లేవాడినని తెలిపాడు.

కర్మ సినిమాలో తన నటన ఆకట్టుకున్నా, సినిమా ఆకట్టుకోకపోవడంతో ఖాళీగా ఉన్న సమయంలో ‘ఆర్కా మీడియా’కు చెందిన నీలిమా తిరుమలశెట్టి వద్దకు వెళ్లేవాడిని. మాటల సందర్భంలో కన్నడ దర్శకుడు విష్ణువర్ధన్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో ‘పంజా’ సినిమా తీస్తున్నామని, అందులో నటించమని ఆమె అడిగిందని చెప్పాడు. కథ విని నిర్ణయం చెబుతానని చెప్పి, తన కజిన్ బ్రదర్ అడవి సాయికిరణ్‌ తో ఆ విషయం చెప్పానని తెలిపాడు. అంతే కాకుండా విలన్‌ గా నటించడం ఇష్టం లేదని చెప్పానని అన్నాడు.

"వెంటనే అన్నయ్య సాయికిరణ్ ‘పవన్‌ కల్యాణ్‌ తో నటించే ఛాన్స్‌ అస్సలు వదులుకోకు. ఆయన సినిమాలు కొన్ని కోట్ల మంది చూస్తారు. అంటే నువ్వు కూడా వారందరికీ తెలిసిపోతావ్‌. నీ పెర్ఫార్మెన్స్‌ చూపించుకునేందుకు ఇంతకన్నా మంచి ఛాన్స్‌ దొరకదు’ అని సలహా ఇచ్చాడు. అప్పుడున్న పరిస్థితులు కూడా పంజాలో విలన్ గా నటించేందుకు అనుకూలించాయి. దీంతో సినిమాలో నటించేందుకు ఒకే చెప్పాను" అని చెప్పాడు శేష్. తొలిరోజు షూటింగ్‌ లో బాలీవుడ్‌ నుంచి వచ్చాననుకుని పవన్‌ కల్యాణ్‌ గారు తనను హిందీలో పలకరించారని చెప్పాడు.

దీంతో వెంటనే 'నేను తెలుగువాణ్ణే' అని చెప్పానని, దీంతో తనను బాగా ఎంకరేజ్ చేశారని అన్నాడు. ఈ సినిమా విడుదలైన వెంటనే విలన్ గా, విలన్ కొడుకుగా చెయ్యమంటూ చాలా ఆఫర్లు వచ్చాయని అన్నాడు. అయితే తాను సినీ పరిశ్రమలో విలన్ గా సెటిలయ్యేందుకు రాలేదని, విభిన్నమైన సినిమాల్లో నటించేందుకే వచ్చానని చెప్పి, వాటిని అంగీకరించలేదని అన్నాడు. తరువాత బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి కుమారుడి పాత్రను రాజమౌళిగారు ఇచ్చారని అన్నాడు. తనకు సినిమా తప్ప మరో వ్యాపకం తెలీదని అడివి శేష్ తెలిపాడు.

More Telugu News