: కశ్మీర్ ముఖ్యమంత్రిపై మండిపడుతున్న పోలీసులు.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు!

జమ్ము కశ్మీర్‌లోని మెహబూబా ముఫ్తీ సర్కారుపై  పోలీసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఓటు బ్యాంకు కోసం వేర్పాటు వాదులపై మెతక వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు.

శుక్రవారం కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా ఉగ్రవాది జునైద్ మట్టూ హతమయ్యాడు. శనివారం అతడి అంత్యక్రియలు నిర్వహించారు. వందలాదిమంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో కొందరు పాకిస్థాన్ జెండాలు పట్టుకుని మరీ ముందుకు సాగారు. అంతేకాదు దాదాపు 12 మంది ఉగ్రవాదులు కూడా పాల్గొని తుపాకులు గాల్లోకి పేల్చి నివాళి అర్పించారు.

ఉగ్రవాది మట్టూ గ్రామానికి 22  కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్వామాలోని అవంతిపొరాలో లష్కరే దాడిలో అమరుడైన 26 ఏళ్ల ఎస్‌హెచ్ఓ ఫెరోజ్ దార్ అంత్యక్రియలు జరిగాయి. ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఆరుగురిలో అతను ఒకరు. ఫెరోజ్ అంత్యక్రియల్లో ఒక్క పోలీసు కానీ, పారామిలటరీ జవాను కానీ కనిపించకపోవడం గమనార్హం.

కాగా, ఉగ్రవాదుల విషయంలో కాస్తంత సహనం వహించాలంటూ ముఫ్తీ ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. 2014లో పీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనక జమైత్-ఇ-ఇస్లామీ కార్యకర్తల కృషి ఉందని భావిస్తున్న ప్రభుత్వం వారిని చూసీ చూడనట్టుగా వదిలేస్తోంది. పోలీసులపై వేర్పాటువాదులు దాడులకు దిగుతున్నా ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో వారు లక్ష్యంగా మారుతున్నారని డీజీపీ శేష్ పాల్ వైద్ తెలిపారు.

More Telugu News