: భారత్‌లో జూనియర్ మలాలా.. చదువు కోసం భర్తకు తలాక్ చెప్పిన 16 ఏళ్ల బాలిక.. దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం!

దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌పై విస్తృత చర్చ జరుగుతున్న వేళ.. పశ్చిమబెంగాల్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక భర్తకు మూడుసార్లు తలాక్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. చదువు కొనసాగించేందుకు భర్త అడ్డు చెప్పడంతో బాలిక ఈ నిర్ణయం తీసుకుంది. బాలిక నిర్ణయం విని పలువురు ప్రశంసిస్తున్నారు. బాలికల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ బహుమతి విజేత, పాకిస్థాన్‌కు చెందిన యూసఫ్‌జాయ్ మలాలాతో ఆమెను  పోల్చుతున్నారు. తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకోవాలనుకున్నానని, మలాలా దారిలో పయనిస్తానని మంపి ఖతూన్ పేర్కొంది.

కోల్‌కతాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్లిక్‌పూర్ మండిబజార్‌ మంపి స్వగ్రామం. ఓ టీస్టాల్ యజమాని సర్జుల్ ఘరమి ముగ్గురు కుమార్తెల్లో మంపి ఒకరు. తొమ్మిదో తరగతి చదువుతుండగా వివాహమైంది. చదువు కొనసాగిస్తానన్న అంగీకారంపైనే నిఖా జరిగింది. ఈ ఏడాది జరిగిన మాధ్యమిక పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. దీంతో తాను 11వ తరగతిలో చేరుతానని భర్తకు చెప్పింది. అందుకు భర్త నిరాకరించాడు. అయినా పట్టువదలకుండా పలుమార్లు భర్తను వేడుకుంది. అయినా భర్త నుంచి ఆమోదం లభించలేదు. ఇటీవల పుట్టింటికి వెళ్లిన మంపి చదువుపై తనకున్న మక్కువను తల్లిదండ్రులకు తెలియజేసింది. చదువు కొనసాగిస్తానని, భర్త ఇంటికి వెళ్లేది లేదని తేల్చి చెప్పింది.

గత నెలలో కృష్ణ‌చందాపూర్‌లోని హైస్కూల్‌లో చేరింది. ఆమె ట్యూషన్ ఫీజులను హెడ్మాస్టర్ చందన్ కుమార్ రద్దు చేశారు. మంపి స్కూల్లో చేరిన విషయం తెలుసుకున్న భర్త, అత్తమామలు బాలిక ఇంటికి వచ్చి ఆగ్రహంతో ఊగిపోయారు. చదువును ఆపేసి తమతో పాటు ఇంటికి పంపించాల్సిందిగా కోరారు. సమస్య పెద్దదిగా మారుతున్నట్టు గ్రహించిన బాలిక భర్త వద్దకు చేరుకుని మూడుసార్లు తలాక్ చెప్పింది. దీంతో ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే విడాకులు అయిపోయాయి. దీంతో మంపిని తీసుకెళ్లేందుకు వచ్చినవారు పెట్టేబేడా సర్దుకుని పయనమయ్యారు. తల్లిదండ్రులు తనకు అండగా నిలబడడం చాలా ఆనందంగా ఉందని మంపి తెలిపింది. బాలిక నిర్ణయం గురించి తెలియడంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. 

More Telugu News