: రాష్ట్రపతి అభ్యర్థి పేరు చెప్పడం లేదు.. వచ్చి మద్దతు ఇవ్వమని అడుగుతున్నారు!: సీతారాం ఏచూరి

రాష్ట్రపతి ఎన్నిక ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు తాము పోటీలో నిల‌బెట్ట‌నున్న అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు తెలపాలంటూ విప‌క్ష నేత‌ల‌తో భేటీ అవుతున్నారు. అయితే త‌మ‌ అభ్యర్థి పేరును మాత్రం ఆ పార్టీ ర‌హ‌స్యంగానే ఉంచింది. ఇదే అంశంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్ లు క‌లిశారు.

ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎన్డీఏ ఎవ‌రిని నిల‌బెడుతుందో ఏ పేరునూ వారు తనకు చెప్ప‌లేద‌ని అన్నారు. అభ్య‌ర్థి పేరు చెప్ప‌కుండానే త‌మ‌ మద్దతను కోరింద‌ని అన్నారు. మద్దతు ఇవ్వాలంటే అభ్యర్థి ఉండాలని, ఆ అభ్యర్థి రాజ్యాంగాన్ని పరిరక్షించ గలిగే వ్యక్తి అయి ఉండాలని అన్నారు. పేరు చెప్ప‌కుండానే మ‌ద్దతు ఎలా ఇస్తామ‌ని అన్నారు. నాలుగు రోజుల తర్వాత తాము అభ్య‌ర్థి పేరును తెలిపి, మళ్లీ సంప్రదింపులు జరుపుతామని బీజేపీ నేత‌లు త‌న‌తో చెప్పినట్టు ఏచూరి తెలిపారు.       

More Telugu News