: అలవోకగా సెమీ ఫైనల్ దాటేశారు... పాక్ కు ప్రమాద ఘంటికలు మోగించారు!

టీమిండియా టాప్ 3 బ్యాట్స్ మన్ ఆడుతూపాడుతూ అలవోకగా లక్ష్యాన్ని దాటేసి పాక్ కు ప్రమాద ఘంటికలు మోగించారు. పాకిస్థాన్ తో పోరాటం ద్వారా ఐసీసీ ఛాపింయన్స్ లీగ్ ప్రారంభించిన భారతజట్టు తరువాతి మ్యాచ్ లో శ్రీలంక చేతిలో మట్టికరిచింది. భారత్ తో ఓటమితో బుద్ధి తెచ్చుకున్న పాక్ ఊహించని రీతిలో పుంజుకుని సెమీ ఫైనల్ లో ప్రవేశించింది. అనంతరం పటిష్ఠమైన ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ లో ప్రవేశించింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటైన టీమిండియా సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది.

ఆదిలో బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. 5 రన్ రేట్ తో పరుగులు సాధిస్తూ వారిని ఆత్మరక్షణలో పడేశారు. భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్.. బౌలర్ ఎవరైనా ఆటతీరు మారదన్నట్టు ధాటిగా ఆడారు. దీంతో 25 ఓవర్లలో బంగ్లాదేశ్ రెండు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి బలంగా కనిపించింది. ఈ క్రమంలో బౌలింగ్ కు దిగిన ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ మ్యాచ్ గతిని మార్చాడు.

ఇద్దరు బ్యాట్స్ మన్ ను అవుట్ చేయడమే కాకుండా ధారాళంగా పరుగులివ్వకుండా కట్టడి చేశాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు కేవలం 264 పరుగులకే పరిమితమైంది. తమీమ్ ఇక్బాల్, ముష్పికర్ రహీమ్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ దావన్, రోహిత్ శర్మలు ఏమాత్రం తొందర లేకుండా కళాత్మక షాట్లతో ఆకట్టుకున్నారు ఈ క్రమంలో అర్ధ సెంచరీకి చేరువలో ధావన్ అవుటయ్యాడు. అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీతో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. వీరిద్దరి భాగస్వామ్యం అద్భుతంగా కొనసాగింది. భారీ షాట్లతో పనేంటన్నట్టుగా, కళాత్మకంగా బంతిని బౌండరీకి తరలిస్తూ జట్టును విజయపథంలో నిలిపారు. వీరిద్దరూ ఆడిన తీరు చూస్తుంటే స్కోరు 400 ఉన్నా ఏమీ ఫర్వాలేదన్నట్టు సాగింది. దీంతో పాకిస్థాన్ కు గుబులు పట్టుకుంది. బౌలింగ్ బలం కారణంగా ఫైనల్లో ప్రవేశించిన పాక్ టీమిండియాను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

More Telugu News