: సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది... మైసూర్ రాజవంశానికి 400 ఏళ్ల శాప విముక్తి!

400 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజ వంశానికి శాపవిముక్తి కలిగింది. సువిశాల రాజ్యం, అంగ, అర్థబలం కలిగిన రాజవంశం... లంకంత ప్యాలెస్ అయినా గత 400 ఏళ్లుగా ఆ ఇంట చిన్నారుల చిందులు లేవు, బోసినవ్వుల మురిపాలు లేవు. 400 ఏళ్ల ఎదురు చూపుల అనంతరం మైసూర్ రాజవంశానికి శాపవిముక్తి కలిగింది.... 400 ఏళ్ల క్రితం శ్రీరంగపట్టణం రాజు శ్రీరంగరాయన (తిరుమలరాజ) భార్య అలమేలమ్మ శాపం రాజవంశానికి తగిలింది. క్రీ.శ. 1612లో తిరుమలరాజ మైసూరు సింహాసనం ఏలుతుండగా, రాజ ఒడయార్‌ ఆయనపై తిరుగుబావుటా ఎగురవేసి, ఆయనను సింహాసనం నుంచి దించి రాజయ్యాడు.

 నమ్మకద్రోహంతో ఆవేదనకు గురైన తిరుమలరాజ భార్య అలమేలమ్మ కొన్ని ముఖ్యమైన ఆభరణాలను తీసుకుని తలకాడుకు వెళ్లిపోయింది. శత్రుశేషం ఉండకూడదని భావించిన ఒడయారు సైనికులు ఆమెను వెతుక్కుంటూ తలకాడు చేరుకుని, ఆమెను చుట్టుముట్టిన సందర్భంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అలమేలమ్మ... మైసూరు రాజవంశం నిలవదని, ఆ ఇంట సంతాన భాగ్యం కలగదని శపించి కావేరి నదిలో దూకి తనువు చాలించిందని చరిత్ర చెబుతోంది. ఆమె శాపం మహత్యమో, లేక మరేదైనా కారణమో గానీ అప్పటి నుంచి నేటి వరకు పట్టాభిషక్తులైన వారంతా సంతానయోగం లేక మనోవేదనకు గురైన వారే.

 దీంతో సమీప బంధువుల్లోని యోగ్యుడైన మగపిల్లాడ్ని ఎంపిక చేసి, దత్తత తీసుకుని రాజవంశ వారసునిగా ప్రత్యేకపూజలు నిర్వహించి, అభిషేకం చేసి మైసూర్ మహారాజుగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైసూర్ మహారాజుగా పట్టాభిషక్తుడైన యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ కు గత జూన్ 27న త్రిషీక కుమారితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో త్రిషీక కుమార్ గర్భం ధరిస్తుందని, మగపిల్లవాడే పుడతాడని జ్యోతిష్యులు చెప్పినట్టుగానే, ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భవతి. దీంతో రాజవంశంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడు దసరా ఉత్సవాలు మరింత అంగరంగ వైభవంగా నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News