: ‘గూగుల్’ ఉద్యోగుల కోసం మూడు వందల మాడ్యులర్ ఇళ్లు!

ఇళ్ల ధరలు, రియల్ ఎస్టేట్ ధరలు ఒక రేంజ్ లో ఉండటంతో ఐటీ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల కోసం మాడ్యులర్ ఇళ్లను నిర్మించాలని చూస్తున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజం ‘ఆపిల్’, కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో కొత్తగా సర్కులర్ భవనం నిర్మించాలని అనుకుంటోంది. తమ సంస్థకు చెందిన వేలాది మంది ఉద్యోగులను ఈ భవనంలోకి తరలించాలని నిర్ణయించింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ కూడా తమ సంస్థ ఉద్యోగుల కోసం మెన్లోపార్క్ లో సుమారు పదిహేను వందల ఇళ్లను నిర్మించనుంది. తాజాగా, గూగుల్ సంస్థ కూడా ఓ నిర్ణయం తీసుకుంది.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఇళ్ల కొరత తీవ్రంగా ఉండి, ఇంటి ధరలు విపరీతంగా ఉండటంతో తమ సంస్థ ఉద్యోగుల సౌకర్యార్థం మాడ్యులర్ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘ఫ్యాక్టరీ ఓఎస్’తో మూడు కోట్ల డాలర్ల ఒప్పందాన్ని ‘గూగుల్’ మాతృసంస్థ అల్ఫాబెట్ ఇన్ కార్పొరేషన్ కుదుర్చుకుంది. మూడు వందల మాడ్యులర్ ఇళ్లను సదరు సంస్థ నిర్మించి ‘గూగుల్’ తరలించమన్న చోటుకి వాటిని తరలిస్తుంది. ఈ సందర్భంగా ‘ఫ్యాక్టరీ ఓఎస్’ వ్యవస్థాపక సీఈఓ రిక్ హోలిడే మాట్లాడుతూ, ఈ తరహా ఇళ్లలో అద్దెకు ఉండటం వల్ల నెలకు ఏడు వందల డాలర్ల వరకు పొదుపు చేసుకోవచ్చని అన్నారు. కాగా, మియామి, డెట్రాయిట్, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఇంటిని కొనుగోలు చేయాలంటే చాలా పెద్దమొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంది. అలమెడా, శాంతాక్లారా, శాన్ మాటియో, సిలికాన్ వ్యాలీలో ఇళ్ల ధరలు భారీగా ఉన్నట్టు ఆన్ లైన్ రియల్ ఎస్టేట్ సంస్థ ట్రూలియా తెలిపింది.

More Telugu News