: భూ ఆక్ర‌మ‌ణ‌ల‌ను గ‌త ప్ర‌భుత్వాలే నిర్ల‌క్ష్యం చేశాయి: సర్కారుపై వస్తున్న విమ‌ర్శ‌ల‌పై మ‌ంత్రి హ‌రీశ్ రావు

భూ ఆక్ర‌మ‌ణ‌ల‌ను గ‌త ప్ర‌భుత్వాలే నిర్ల‌క్ష్యం చేశాయని, ఇప్పుడు తాము ప‌లు విష‌యాల‌ను బ‌య‌ట‌పెడుతోంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప్ర‌తిప‌క్ష పార్టీల నేతలు బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మ‌ంత్రి హ‌రీశ్ రావు అన్నారు. రిజిస్ట్రేష‌న్లలో ఎటువంటి లోపాలు జ‌ర‌గ‌కుండా త‌మ ప్ర‌భుత్వం అందుకు సంబంధించిన చ‌ట్టంలో ఒక స‌వ‌ర‌ణ తేబోతుందని అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లు అంటూ త‌మ ప్ర‌భుత్వంపై ఎన్నో ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని, అందుకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా బ‌య‌ట‌పెట్టలేద‌ని అన్నారు. ప్రతిపక్ష నేతలు ఒక కొత్త విష‌యం కూడా చెప్ప‌డం లేద‌ని అన్నారు. అప్ప‌టి ప్ర‌భుత్వాలు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే త‌మ ప్ర‌భుత్వం ఇప్పుడు అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెడుతోందని అన్నారు.

అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ‌ అధికారులను సస్పెండ్ చేసి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు హరీశ్ రావు చెప్పారు. అక్ర‌మ రిజిస్ట్రేష‌న్‌లపై త‌మ ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోందని అన్నారు. స‌బ్ రిజిస్ట్రార్ల‌కు సెక్ష‌న్ 47 కింద ఉన్న ప‌లు అధికారాల‌ను ర‌ద్దు చేశామ‌ని అన్నారు. రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని అన్నారు. లోపాలు ఏవైనా ఉంటే వాటిని తొల‌గించి, రిజిస్ట్రేష‌న్ యాక్ట్ ను మ‌రింత ప‌క‌డ్బందీగా త‌యారు చేస్తున్నామ‌ని అన్నారు. 60 ఏళ్ల గ‌త ప్ర‌భుత్వాల‌ పాల‌న‌లో రిజిస్ట్రేష‌న్ ఆఫీసుల్లో లంచం ఇవ్వ‌కుంటే అధికారులు ఒక్క సంత‌కం కూడా పెట్ట‌లేదని, ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వ‌కుండానే ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారని అన్నారు.      

More Telugu News