: ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ఎక్కువ దోపిడీ జరుగుతోంది: గవర్నర్ కు వివరించిన ఉత్తమ్

హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జరుగుతున్న భూ కబ్జాలకు, సీఎం కేసీఆర్ కుటుంబీకులకు సంబంధం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ నరసింహన్ తో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జానా రెడ్డి, షబ్బీర్ అలీలు నేడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత విలువైన స్థలాలన్నీ కబ్జాకు గురవుతున్నాయని చెప్పారు. భూ కబ్జా కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన వనరులు, భూములు, నీరు దోపిడీకి గురవుతున్నాయంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పదేపదే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే తెలంగాణ నీరు, వనరులు, భూములు అన్నీ మనకే దక్కుతాయని మనమంతా ఎంతో ఆశపడ్డామని... మన ఆశలకు అనుగుణంగానే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. అయితే ఈ మూడేళ్లలో తెలంగాణ ప్రజల ఆస్తులను, వనరులను, నీటిని, భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇతరులకు తాకట్టు పెడుతూ వచ్చిందని మండిపడ్డారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే ప్రత్యేక తెలంగాణలోనే భూ కబ్జాలు ఎక్కువయ్యాయనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఉత్తమ్ తెలిపారు. భూకబ్జాలలో కేసీఆర్ కుటుంబీకులు, కార్యాలయ అధికారులు, సన్నిహితులు ఉన్నారనే విషయానికి సంబంధించి గవర్నర్ కు ఆధారాలు ఇచ్చామని చెప్పారు.

More Telugu News