: మీరు మా వైపు ఉన్నారా? లేక ఖతార్ తోనా?: పాక్ ప్రధానిని ప్రశ్నించిన సౌదీ రాజు

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సౌదీ అరేబియా రాజు సల్మాన్ సూటిగా ఓ ప్రశ్న వేశారు. మీరు మాతో ఉన్నారా? లేక ఖతార్ కు మద్దతుగా ఉంటారా? అంటూ ముక్కుసూటిగా అడిగారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో ఖతార్ తో పలు గల్ఫ్ దేశాలు తమ సంబంధాలను తెంపుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, పాక్ మద్దతును సౌదీ కోరింది. ఈ నేపథ్యంలో, ఖతార్ సంక్షోభానికి ఒక పరిష్కారాన్ని కనుగొనే క్రమంలో పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వాతో పాటు పలువురు అత్యున్నత అధికారులు సౌదీకి వెళ్లారు. ఈ సందర్భంగా సౌదీ రాజుతో చర్చలు జరుపుతున్న సమయంలో... సౌదీ రాజు నుంచి నవాజ్ కు పై ప్రశ్న ఎదురైంది.

దీనికి సమాధానంగా, మధ్య ప్రాచ్యంలో విభేదాలు తలెత్తేలా, చీలికలు తీసుకువచ్చేలా జరిగే ఎలాంటి ప్రయత్నాలకూ పాక్ మద్దతుగా ఉండదని షరీఫ్ చెప్పారు. దీనికి సంబంధించి పాక్ అధికారి ఒకరు మాట్లాడుతూ, పరిస్థితి తీవ్రతను తగ్గించడానికి ఖతార్ తో పాక్ మాట్లాడుతుందని చెప్పారు. ఈ క్రమంలో తమ ప్రధాని ఖతార్, కువైట్, టర్కీలలో పర్యటిస్తారని చెప్పారు.

More Telugu News