: ఫుడ్ నుంచి సినిమా వరకూ... క్యాబ్ నుంచి విమానం వరకూ...: ఫ్లిప్ కార్ట్ తెస్తున్న మెగా యాప్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సరికొత్త ఆలోచనతో వచ్చింది. ప్రస్తుతం అందుబాటులోని వాణిజ్య పరమైన యాప్ లన్నింటికీ రారాజుగా ఉండేలా 'ఎవ్రీథింగ్ యాప్' పేరిట మెగా యాప్ ను ఆవిష్కరించనుంది. ఈ యాప్ ద్వారా నచ్చిన ఆహారం నుంచి సినిమా టికెట్ల వరకూ, క్యాబ్ బుకింగ్ నుంచి విమానం టికెట్ల కొనుగోలు వరకూ సులువుగా చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ యాప్ ను ఆవిష్కరించేందుకు ఇప్పటికే ఫుడ్, క్యాబ్, ట్రావెల్ సంస్థలను భాగస్వాములుగా చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు.

కొత్తగా సంస్థలో చేరిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్ కృష్ణమూర్తి వ్యూహంతో ఈ ఆలోచన చేసినట్టు తెలిపారు. దీంతో పాటు విలువ ఆధారిత సేవలనూ అందించాలని నిర్ణయించామని, అతి త్వరలో ఇంటికి అవసరమయ్యే నిత్యావసరాలు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభించనున్నామని, తొలి దశలో భారీ ఎత్తున డిస్కౌంట్లు అందిస్తామని తెలిపింది. కాగా, ఇదే తరహా ఆలోచన స్నాప్ డీల్ గత సంవత్సరమే చేసినప్పటికీ, ఫలించలేదు. ఆహార డెలివరీ సేవల ప్లాట్ ఫాం జుమాటోతో పాటు ఉబెర్, క్లియర్ ట్రిప్ వంటి సంస్థలతో స్నాప్ డీల్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రయత్నించింది. డీజిటల్ ఈ వ్యాలెట్ సేవల అగ్రగామి పేటీఎం మాత్రం కొంత విజయవంతమై అన్ని సేవలూ కాకున్నా, కొన్నింటిని అందిస్తోంది. ఈ కొత్త ఫ్లిప్ కార్ట్ యాప్ డిసెంబర్ లోగా విడుదలవుతుందని సంస్థ మోనిటైజేషన్ సీనియర్ డైరెక్టర్ ప్రకాశ్ సికారియా పేర్కొన్నారు.

More Telugu News