: ఆగిపోయిన మూడు ఇస్రో అటామిక్ శాటిలైట్ గడియారాలు... జీపీఎస్ సేవలకు అంతరాయం!

ఇండియాలో జీపీఎస్, నావిగేషన్ సేవలను అందించే నిమిత్తం ఇస్రో ప్రయోగించిన ఏడు శాటిలైట్లలో ఒకదానికి చెందిన మూడు అటామిక్ గడియారాలు నిలిచిపోయాయి. మరింత కచ్చితమైన సమాచారాన్ని అందించే దిశగా యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న మూడు రుబిడియమ్ అటామిక్ గడియారాలు నిలిచిపోయాయని, ఒకదానికి సిగ్నల్ ఎంతమాత్రమూ రావడం లేదని, దీంతో పొజిషన్ యాక్సురెసీ సమస్యగా మారిందని అధికారులు తెలిపారు. 'దేశీ జీపీఎస్'గా పిలుచుకుంటున్న ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ శాటిలైట్ నింగిలోకి ఎగసి సేవలందించేందుకు సిద్ధమైన వేళ, ఈ అవాంతరం ఏర్పడటం గమనార్హం.

కాగా, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కోసం 9 శాటిలైట్లను వాడుతుండగా, వాటి కోసం 27 టైమ్ కీపర్స్ ను ఇస్రో కొనుగోలు చేసింది. ఈ 9 శాటిలైట్లలో 7 తమ కక్ష్యల్లో తిరుగుతుండగా, రెండు స్టాండ్ బైగా ఉన్నాయి. మూడు అటామిక్ క్లాక్స్ నిలిచిపోయాయన్న విషయాన్ని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. మిగతా శాటిలైట్లు సక్రమంగానే పని చేస్తున్నాయని తెలిపారు. నావిగేషన్ వ్యవస్థకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. మరిన్ని నావిగేషన్ శాటిలైట్లను త్వరలో ప్రయోగిస్తామని, అందుకు అవసరమైన అనుమతుల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.

More Telugu News