: రాజస్థాన్ లో తీవ్ర కలకలం... తమిళనాడు కొన్న ఆవులను తగులబెట్టిన గో సంరక్షకులు

తమిళనాడు పశుసంవర్థక శాఖ, తమ రాష్ట్రంలో పశువుల ఉత్పత్తిని పెంచే నిమిత్తం రాజస్థాన్ లో ఆవులను కొనుగోలు చేసి లారీల్లో తీసుకు వెళుతుండగా, బార్నర్ ప్రాంతంలో అడ్డుకున్న ప్రజలు, లారీని తగులబెట్టే ప్రయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. మొత్తం 5 లారీల్లో 80 ఆవులను తీసుకు వెళుతుండగా, గో సంరక్షకులు అడ్డుకున్నారు. లారీలకు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో 10 ఆవులు, మూడు దూడలు మరణించాయని రాజస్థాన్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కేంద్రం ప్రారంభించిన 'రాష్ట్రీయ గోకుల్ మిషన్'లో భాగంగా ఈ ఆవులను కొనుగోలు చేసి తీసుకు వెళుతుండగా, లారీల్లో ఉన్నవారికి ఏ మాత్రం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు.

"మేము గో సంరక్షకులను బతిమాలాం. పేపర్లు చూడాలని చెప్పాం. అన్ని అనుమతులూ ఉన్నాయని అన్నాం. కానీ వారు వినలేదు. వారంతా మద్యం తాగి ఉన్నారు. మమ్మల్ని పక్కకు నెట్టేసి మూగ జీవాలను తగులబెట్టారు" అని ట్రక్ డ్రైవర్లలో ఒకడైన గేవర్ రామ్ వ్యాఖ్యానించాడు. జైసల్మేర్ జిల్లాలోని పలువురు రైతుల నుంచి వీటిని కొనుగోలు చేశామని, తమిళనాడులోని చెట్టినాడు ప్రాంతానికి తీసుకు వెళుతున్నామని, తమతో ఓ వెటర్నరీ వైద్యుడు, ఐదుగురు ప్రభుత్వ అధికారులు ఉన్నారని తెలిపారు. జాతీయ రహదారి - 15పై ప్రయాణిస్తూ, బామర్ పట్టణాన్ని దాటగానే తొలుత 15 నుంచి 20 మంది దాడికి వచ్చారని, డ్రైవర్లతో వాగ్వాదం జరుగుతూ వుండగా మరింతమంది వచ్చి చేరారని, దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనకు పాల్పడ్డ వారిలో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు బామర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ గగన్ దీప్ సింగ్లా వెల్లడించారు. మొత్తం 50 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మరింత మందిని గుర్తించి అరెస్ట్ చేయాల్సి వుందని వెల్లడించారు. సమయానికి తాము వెళ్లకుంటే మరిన్ని గోవులు మరణించి వుండేవని అన్నారు. ఆవులను తగులబెట్టిన తరువాత జాతీయ రహదారిపై నిరసనకారులు ధర్నాకు దిగగా, లాఠీచార్జ్ చేసి వారిని తరిమేశామని పేర్కొన్నారు.

More Telugu News