: హైదరాబాదులో డబ్బులు వసూలు చేసి, బిచాణా ఎత్తేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ

హైదరాబాదులోని మరోకంపెనీ బిచాణా ఎత్తేసింది. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం పేరు చెప్పి నిరుద్యోగుల నుంచి దండిగా వసూలు చేసిన అవెన్యూ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హైదరాబాదులోని కొండాపూర్‌ లోని ఏక్తా టవర్‌ లో జగదీశ్‌ అనే వ్యక్తి...అవెన్యూ ఐటీ కంపెనీని కొద్ది నెలల క్రితం నెలకొల్పాడు. ఇందులో ఉద్యోగం ఇస్తామని, ఆకర్షణీయమైన జీతం అందిస్తామని 70 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు మొదలు లక్షన్నర రూపాయల వరకు వసూలు చేశారు.

అనంతరం మైండ్‌ స్పేస్‌ లోని స్పేసియస్‌ టవర్స్‌ లో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆఫర్‌ లెటర్లు కూడా ఇచ్చారు. దీంతో వారంతా ఉద్యోగాల్లో చేరారు. ఒక నెల జీతం ఇచ్చిన సంస్థ యజమాని రెండు నెలలుగా జీతాలివ్వడం లేదు. దీనిపై ఉద్యోగులు నిలదీయడంతో జగదీష్ రెండు రోజులుగా కంపెనీకి రావడం లేదు. దీంతో నల్గొండకు చెందిన మాడ్గుల గణేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేచేశాడు. దీంతో ఆ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ విజయవాడకు చెందిన కోతూరి కార్తీక్‌ (26), కంప్యూటర్స్‌ మెయింటెనెన్స్‌ చేసే ఖమ్మం జిల్లాకు చెందిన వల్లభరెడ్డి ఫణీంద్ర కుమార్‌ (28) లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. డబ్బులు వసూలు చేసిన సంస్థ యజమాని జగదీశ్‌ తో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

More Telugu News