: చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తి!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు తన సమక్షంలో మూడు సార్లు కూర్చుని చర్చలు జరిపినప్పటికీ, ఒక్క నిర్ణయమూ అమలు కాలేదని అభిప్రాయపడ్డ ఆయన, మంత్రుల స్థాయిలో జరిగిన చర్చలూ ఫలవంతం కాలేదని సీఎంల ఎదుటే తన అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఇకపై మంత్రుల కమిటీ సమావేశాలు లేనట్టేనని, సీఎంలిద్దరూ స్వయంగా హాజరైతేనే తదుపరి చర్చల్లో గవర్నర్ పాల్గొంటారని అధికార వర్గాలు అంటున్నాయి.

ఇటీవల విద్యుత్ బకాయిల విషయమై రెండు రాష్ట్రాల మధ్యా నెలకొన్న విభేదాలు, పోటాపోటీ లేఖాస్త్రాలు, కరెంటు సరఫరా నిలిపివేత తదితరాలపై గవర్నర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక సచివాలయంలోని ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశంపై గవర్నర్ ప్రత్యేక చొరవ చూపి మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, యనమల, అచ్చెన్నాయుడు తదితరులతో సమావేశమై చర్చించినా, సమస్య పరిష్కారం కాలేదు. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్ లోని సంస్థల విభజనపైనా ముందడుగు పడలేదు. ఇదే సమయంలో సమస్యల పరిష్కారంలో గవర్నర్ విఫలమయ్యారన్న ప్రచారం సాగడంతో, ఇక చర్చలు సాగించి లాభం ఏంటన్న ఆలోచనలో గవర్నర్ ఉన్నారని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News