: తడబడిన లంకేయులు... నిలబడిన పాకిస్తానీయులు!

కార్డిఫ్ లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ ను గెలిపించి సెమీ ఫైనల్ లో ఆడేందుకు పంపింది. కార్డిఫ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ బెర్త్ పోరులో శ్రీలంక ఆటగాళ్లు ఆరంభంలో ఆకట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత బ్యాట్స్ మన్ ఏ దశలోనూ రాణించకపోవడంతో కేవలం 236 పరుగులకే లంకేయులు ఆలౌట్ అయ్యారు. అనంతరం బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై ఆదిలో తడబడ్డ బౌలర్లు 74 పరుగుల వద్ద ఫఖర్ జమాన్ ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చారు. అప్పటికి పాక్ పటిష్ఠ స్థితిలో ఉంది. అనంతరం కాసేపటికే బాబర్ ఆజమ్ ను 92 పరుగుల వద్ద అవుట్ చేశారు. ఆ వెంటనే మహ్మద్ హఫీజ్ ను 95 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపారు. మరికాసేపటికి అజహర్ అలీని కూడా 110 పరుగుల వద్ద అవుట్ చేశారు. దీంతో శ్రీలంక విజయం ఖాయమని అంతా అనుకున్నారు.

ఈ దశలో జాగ్రత్తగా ఆడిన షోయబ్ ను 131 పరుగులు వద్ద పెవిలియన్ కు పంపి బ్రేక్ ఇచ్చారు. దీంతో శ్రీలంక గెలవడం ఖాయమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆ వెంటనే 137 పరుగుల వద్ద ఇమాద్ వసీం అవుటయ్యాడు. కాసేపు ప్రతిఘటించిన ఫాహిమ్ అష్రాఫ్ కూడా 162 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (61)కు జతకలిసిన ఆమిర్ (28)ను అవుట్ చేయడంలో విఫలమయ్యారు. ఇందులో బౌలర్లు ఎలాంటి తప్పిదం చేయలేదు. ఎక్కడా లయ తప్పలేదు. ప్రధానంగా మలింగ రెండు సార్లు వారిని ఇంచుమించు అవుట్ చేశాడు. అయితే చేతుల్లో పడిన బంతిని పెరీరా, ప్రసన్నలు వదిలేసి అవకాశాలు ఇచ్చారు. అనంతరం పీల్డింగ్ వైఫల్యంతో రెండు సార్లు సులభమైన రన్ అవుట్ లు చేయడంలో తడబడ్డారు. దీంతో ఓడిపోవాల్సిన మ్యాచ్ ను కెప్టెన్ ఇన్నింగ్స్ తో తనవైపు లాక్కుని జట్టును గెలిపించి చూపించాడు సర్ఫరాజ్. 

More Telugu News