: ఎమ్మెల్యేలను శశికళ 1000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారట!: స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న రాజకీయ మార్పులపై తమిళనాడులోని ఒక టీవీ చానెల్ తో పాటు జాతీయ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆ రాష్ట్రంలో పెను కలకలం రేపుతోంది. గద్దెనెక్కేందుకు శశికళ 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న విషయం వెలుగులోకి రావడంతో తమిళనాట ఏ ఇద్దరు కలిసినా...దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

జయలలిత మరణానంతరం పార్టీ అధినేత్రిగా రాష్ట్రాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని భావించిన శశికళకు పన్నీరు సెల్వం షాక్ ఇచ్చారు. దీంతో ఆమె అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, పన్నీరు సెల్వంను దెబ్బకొట్టి, అధికారం చేజిక్కించుకోవాలంటే ఎమ్మెల్యేల ‘విశ్వాసం’ చాలా అవసరమని ఆమె నిర్ధారణకు వచ్చారు. దీంతో వెంటనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా చెన్నై శివార్లలోని కుత్తూరు రిసార్ట్ కు రావాలని ఆమె నుంచి ఆహ్వానాలు అందాయని స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడైంది.

శశికళ వర్గంలో ఉండి, పన్నీరు సెల్వం వర్గంలో చేరిన మధురై దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శరవణన్ తెలిపిన వివరాల ప్రకారం...‘ఓపీఎస్‌ (ఒ.పన్నీరుసెల్వం) తిరుగుబావుటా ఎగురవేసినట్లు తేలిపోగానే అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలందరూ చెన్నైకి రావాలని శశికళ ఆదేశించారు. దూర ప్రాంతాల వారు విమానాల్లో, అవి అందుబాటులో లేనివారు రైలు, రోడ్డు మార్గాల్లో బయల్దేరారు. వీరందరికీ శశి వర్గం నుంచి ప్రత్యేక వాహనాలు ఎదురెళ్లి స్వాగతం పలికాయి. ఆ వాహనాల్లోకి ఎక్కుతున్నప్పుడే తనకు అండగా నిలుస్తున్నందుకు చిన్నమ్మ 2 కోట్ల రూపాయలు ఇస్తారన్న హామీ లభించింది. అనంతరం గవర్నర్‌ వద్దకు బలప్రదర్శనకు వెళ్లేటప్పుడు మరో 2 కోట్ల రూపాయలు...మొత్తం నాలుగు కోట్లు ఇస్తామని చెప్పారు.

అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్‌ నిర్ణయం ఆలస్యంగా వెలువరించడం, ఓపీఎస్ వర్గం దూకుడు పెంచడంతో ఈ ధర మళ్లీ పెరిగింది. అయితే ఈ సారి గవర్నర్‌ నిర్ణయం వెలువడే వరకు కూవత్తూరు రిసార్టులోనే ఉండేందుకు మరో 2 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు చెప్పారు. దీంతో ఒక్కో ఎమ్మెల్యేకు మొత్తం 6 కోట్ల రూపాయలు ఇస్తామని సాక్షాత్తూ చిన్నమ్మ శశికళే హామీ ఇచ్చారు. అయితే నోట్ల రద్దు కారణంగా కరెన్సీ దొరకడం ఇబ్బందిగా మారిందని, ఆ డబ్బు మొత్తం నగదు రూపంలో ఇవ్వలేమని, కొంత బంగారం రూపంలో ఇస్తామని అన్నారు. దీనికి ఎమ్మెల్యేలంతా తల ఊపారు. దీంతో తన వర్గంలోకి వచ్చిన వారందరికీ ఆమె హామీ ఇచ్చిన మొత్తాన్ని అందజేశారు’ అని శరవణన్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ లో వెల్లడించారు. ఇది తమిళనాడులో పెను కలకలం రేగుతోంది. కూవత్తూరు రిసార్ట్ లో ఎమ్మెల్యేలను దాచిన సమయంలో భారీగా ధనం చేతులు మారుతోందని వార్తా ఛానెళ్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేల 'విశ్వాసం' ధర ఇలా 1000 కోట్ల వరకు ఉందన్న విషయం మాత్రం అప్పుడు బయటకురాలేదు. 

More Telugu News