: అక్కడంతా అవినీతి, అక్రమమే...!: ట్రాన్స్ పోర్టు విభాగంపై కేశినేని నాని విమర్శలు

ట్రాన్స్ పోర్టు విభాగంలో జరిగేదంతా అవినీతి, అక్రమమేనని ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రవాణాశాఖాధికారులు రూల్స్ అతిక్రమిస్తారని అన్నారు. బస్సు యాక్సిడెంట్లన్నింటికీ కారణం రవాణాశాఖాధికారులేనని ఆయన ఆరోపించారు. పాండిచ్ఛేరి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లో మాత్రమే స్లీపర్ క్యారియర్ బస్సులకు రిజిస్ట్రేషన్లు ఉంటాయని, ఇతర రాష్ట్రాల్లో అవి తిరగడానికి అర్హత లేదని, కాసులకు కక్కుర్తిపడే అధికారుల వల్లే ఆ బస్సులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతున్నాయని ఆయన చెప్పారు. అరుణా చల్ ప్రదేశ్ ప్రభుత్వం  2,400 బస్సుల పర్మిట్లను రద్దు చేసిందని ఆయన చెప్పారు.

ఈ విషయాన్ని అధికారికంగా అధికారులకు తెలిపిందని, వివరాలతో కూడిన మెయిల్ ను త్వరలో పంపుతామని చెప్పిందని ఆయన చెప్పారు. ఈ 2,400 బస్సుల్లో సుమారు 900 బస్సులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవని, ఏపీకి చెందిన బస్సులు 600 అయితే, తెలంగాణ బస్సులు 300 అని, ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా రవాణా శాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేశినేని నాని మండిపడ్డారు. గతంలో తాను ఇదే విషయాన్ని ప్రశ్నించేందుకు వస్తే...ఆపరేటర్ గా అడుగుతున్నారా? లేక ఎంపీగా అడుగుతున్నారా? అని తనను అడిగారని, రాద్ధాంతం చేస్తున్నానని విమర్శించారని ఆయన చెప్పారు. ఆర్టీఏ అధికారుల అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియజేసేందుకే తాను వ్యాపారం మానేశానని ఆయన తెలిపారు.

More Telugu News