: డ్రస్సింగ్ రూములో టీమ్ పై కోహ్లీ పరుష పదజాలం... ప్రభావం చూపిన క్లాస్!

నిన్న రాత్రి లండన్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ ఘన విజయం సాధించి సెమీఫైనల్ లో పోరుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. శ్రీలంకతో ఓడిపోయి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న దశ నుంచి అనూహ్యంగా భారత జట్టు పుంజుకోవడం వెనుక డ్రస్సింగ్ రూములో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కాస్తంత పరుష పదజాలాన్ని వాడుతూ, టీమ్ మేట్స్ కు క్లాస్ తీసుకున్నాడట.

"మీరందరూ నిజాయతీగా ఉండాలి. నేనేమైనా అంటే మీరు బాధపడతారని నాకు తెలుసు. వారి ముందు (శ్రీలంక క్రికెటర్లు) నాతో సహా మీరంతా మోకరిల్లి తప్పు చేశాం. చేసిన తప్పులను అంగీకరించాల్సిందే. ఇక ఇప్పుడు మనం నిరూపించుకోవాలి. కోట్లాది మంది ప్రజలు, అభిమానులు మనల్ని ఈ స్థాయికి చేర్చారు. దేశం కోసం చేయగలిగినదంతా చేయాలి. ఆ శక్తి మీలో ఉంది. తిరిగి సత్తా చాటేందుకు యత్నించాలి. గతంలో చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేయవద్దు. ఐక్యంగా ముందుకు సాగి విజయం సాధించాలి. కేవలం ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రాణిస్తే చాలని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ చక్కగా ఆడాలని నేను కోరుకుంటున్నా" అని కోహ్లీ హితవు పలికినట్టు తెలుస్తోంది. కోహ్లీ పీకిన క్లాస్ ఆటగాళ్లపై ప్రభావం చూపగా, వారు సమష్టిగా రాణించి సౌతాఫ్రికాపై విజయం సాధించారు.

More Telugu News