: 'నన్ను దోచుకుందువటే...' నుంచి 'జేజమ్మా... జేజమ్మా' వరకూ... సినారే అందించిన కొన్ని మరపురాని గీతాలు!

సింగిరెడ్డి నారాయణరెడ్డి... సినీ ప్రేక్షక లోకం సినారే అంటే ముద్దుగా పిలుచుకునే వ్యక్తి. ఆయన రాసిన ఎన్నో సినిమా పాటలు తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాయి. 1962లో వచ్చిన 'గులేబకావళి కథ'లో 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ... అంటూ ఆయన రాసిన తొలి సినీ గీతం, ఇప్పటికీ మరువలేనిదే. కొన్ని వందల చిత్రాల్లో మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. 'ఆత్మబంధువు' చిత్రంలో అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, 'కులగోత్రాలు' చిత్రంలో చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా..., 'బందిపోటు'లో వగలరాణివి నీవే సొగసుకాడను నేనే, 'అమరశిల్పి జక్కన'లో ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో, 'గుడి గంటలు'లో నీలి కన్నుల నీడల లోనా..., 'రాముడు భీముడు'లో తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే..., 'మంగమ్మ శపథం'లో కనులీవేళ చిలిపిగ నవ్వెను, 'బంగారు గాజులు'లో అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, 'ధర్మదాత'లో ఓ నాన్నా నీ మనసే వెన్న,' లక్ష్మీ కటాక్షం'లో రా వెన్నెల దొరా కన్నియను చేరా... వంటి పాటలు కొన్ని మచ్చుతునకలు.

ఇవి మాత్రమే కాదు, 'చెల్లెలి కాపురం'లో కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా, 'మట్టిలో మాణిక్యం'లో రింఝిం రింఝిం హైదరబాద్, 'బాలమిత్రుల కథ'లో గున్న మామిడి కొమ్మ మీదా గూళ్లు రెండున్నాయీ, 'తాత మనవడు'లో అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం,' శారద'లో శారదా, నను చేరగా ఏమిటమ్మా సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా, 'అల్లూరి సీతారామరాజు'లో వస్తాడు నా రాజు ఈ రోజు, 'కృష్ణవేణి'లో కృష్ణవేణి, తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి, నా ఇంటి అలివేణి, 'ముత్యాల ముగ్గు'లో గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ, 'శివరంజని'లో అభినవ తారవో నా అభిమాన తారవో, 'మంగమ్మగారి మనవడు'లో చందురుడు నిన్ను చూసి, 'స్వాతిముత్యం'లో లాలి లాలి లాలీ లాలి, వటపత్రశాయికీ వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి, 'సూత్రధారులు'లో జోలా జోలమ్మ జోల నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల, '20వ శతాబ్దం'లో అమ్మను మించి దైవమున్నదా?, 'ఒసే రాములమ్మా'లో ఓ ముత్యాల కొమ్మా.. ఓ రాములమ్మా, 'ప్రేమించు'లో కంటేనే అమ్మ అని అంటే ఎలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా,' సీతయ్య'లో ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ, 'అరుంధతి'లో జేజమ్మా జేజమ్మా... వంటి ఎన్నో పాటలను ఆయన కలం అందించింది. ఈ ఉదయం సినారే కన్నుమూయగా, తెలుగు సాహిత్య, సినీ ప్రియులు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

More Telugu News