: ఉస్మానియాలో అడుగుపెట్టే ధైర్యం లేకే కేసీఆర్ ఆ జీవో తెచ్చారు: జగ్గారెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టే పరిస్థితి లేదని, అందుకే ఓయూలో ఇతరులెవరూ మీటింగ్ పెట్టకూడదని జీవో తెచ్చారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై కేసీఆర్ కక్ష కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓయూకు వెళ్తే రాళ్లు, చెప్పులు పడతాయని ఆయన చెప్పారు. అందుకే ఆయన విద్యార్థులపై కక్షగట్టినట్టు కనిపిస్తోందని చెప్పారు.

ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ వచ్చిందని, అలాంటి యూనివర్సిటీపై ఆంక్షలు పెట్టడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న యూనివర్సిటీలోకి అడుగుపెట్టలేని కేసీఆర్ కూడా ఒక ముఖ్యమంత్రేనా? అని ఆయన ఎద్దేవా చేశారు. తాము మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ పెడతామని, యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. తక్షణమే ఓయూలో సభలు నిర్వహించకూడదన్న జీవోను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News