: మరోసారి అలా జరక్కూడదని నెట్స్ లో చమటోడ్చిన విరాట్ కోహ్లీ!

నేటి మధ్యాహ్నం దక్షిణాఫ్రికాతో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ భారత్ కు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. డిఫెండింగ్ చాంపియన్ గా పోటీలో దిగిన భారత్, సెమీఫైనల్ కు వెళ్లాలంటే, ఈ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందే. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో డక్కౌట్ అయిన కెప్టెన్ కోహ్లీ, మరోమారు అలా జరగకుండా చూసుకునేందుకు నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు.

ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చూస్తుండగా, బాల్ ను విసరడంలో అనుభవజ్ఞుడైన రాఘవేంద్ర బౌలింగ్ లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే, సాధారణంగా మ్యాచ్ లో వాడే వైట్ బాల్ తో కాకుండా, రెడ్ డ్యూక్ బాల్ తో ఈ ప్రాక్టీస్ జరగడం గమనార్హం. సాధారణంగా వైట్ బాల్ తో పోలిస్తే, రెడ్ బాల్ అధికంగా స్వింగ్ అవుతుంది. మరింతగా బౌన్స్ అవుతుంది. రెడ్ బాల్ తో ప్రాక్టీస్ కారణంగా మ్యాచ్ లో వైట్ బాల్ తో ఆడటం సులువవుతుందన్న ఆలోచనతోనే కోహ్లీ ఇలా చేసినట్టు తెలుస్తోంది. ఉమేష్ యాదవ్ తో పాటు యువరాజ్ కూడా కోహ్లీకి బంతులేశాడు. ఇక ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, అధిక సమయాన్ని రవిచంద్రన్ అశ్విన్ తో గడుపుతూ, సలహాలు ఇచ్చాడు. ఆపై బుమ్రా, పాండ్యాలకూ సూచనలు చేశాడు.

More Telugu News