: మేజర్ల ప్రేమ వివాహాలపై కేసులు వద్దు: ఏపీ, టీఎస్ డీజీపీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

మేజర్ లు కుల, మతాంతర వివాహాలను ఇష్టపూర్వకంగా చేసుకుంటే, వారిపై ఎటువంటి కేసులూ పెట్టరాదని ఉమ్మడి హైకోర్టు తెలుగు రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. ప్రేమికుల వివాహానికి ఆధారాలు ఉంటే కేసులు పెట్టవద్దని తెలిపింది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్న కారణంతో పోలీసులు కొత్త జంటలను వేధింపులకు గురి చేయవద్దని పేర్కొంటూ, నల్గొండ జిల్లా గుడిపల్లికి చెందిన ప్రవీణ్‌ అనే యువకుడు వేసిన పిటిషన్‌ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ కెయిత్‌, ఈ మేరకు తీర్పిచ్చారు.

 ప్రేమించి పెళ్లి చేసుకున్న తనపై, తన సతీమణి తండ్రి కిడ్నాప్‌ కేసు పెట్టి జైలుకు పంపారని,  తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ప్రవీణ్‌ ఈ పిటిషన్ వేశారు. ప్రేమ వివాహాల వెనుక ఒత్తిడి, ప్రలోభ పెట్టడం, మత్తు మందులివ్వడం వంటి కారణాలున్నట్టు విచారణలో తేలితేనే కేసులు పెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. వ్యక్తిగత పూచీకత్తుపై ప్రవీణ్ కు బెయిల్ ను మంజూరు చేశారు. నేటి యువత కులాంతర, మతాంతర వివాహాలకు వెనుకాడటం లేదని, వారి అభ్యుదయ వాదానికి తల్లిదండ్రులు సహకరించాలని జడ్జి అన్నారు.

More Telugu News