: నన్ను చంపేసినా మరొకరు పోరాడతారు.. మరేం భయం లేదు: చోటా షకీల్ కు టార్గెట్‌గా మారిన తారెఖ్ ఫతా కీలక వ్యాఖ్యలు

జన్మతః పాకిస్థానీ అయిన కెనడా రచయిత తారెఖ్ ఫతా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను చంపేందుకు పథకం రచించిన చోటా షకీల్ అనుచరుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కెనడాలో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్న తారెఖ్ ఫతా ఈ విషయం తెలిసి స్పందించారు. తనకు ఎటువంటి భద్రత అవసరం లేదని పేర్కొన్నారు. తనను చంపేస్తారన్న భయం లేదని, ఈ గూండాలు తననేమీ చేయలేరని పేర్కొన్నారు. ఈ నవంబరుతో తనకు 68 ఏళ్లు వస్తాయన్న ఆయన, తనను చంపేసినా పర్వాలేదన్నారు. రాడికల్ ఇస్లామిజంపై పోరాటం ఆగదని, తన స్థానంలో మరొకరు చేస్తారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భగవద్గీత, ఖురాన్‌లను ప్రస్తావిస్తూ నిజం మాట్లాడానికి తనకు భయం లేదన్నారు. ‘‘గీత ప్రకారం.. మన పని మనం చేస్తూ పోవాలి. ఫలితం ఆశించకూడదు’’ అని పేర్కొన్నారు. ‘‘అది నిన్ను బాధించినా సరే నిజమే మాట్లాడు’’ అని ఖురాన్ బోధిస్తుందని వివరించారు. కాబట్టి తానెందుకు బాధపడాలని, తనకెందుకు భద్రత? అని ఆయన ప్రశ్నించారు. తనను చంపేందుకు చోటా షకీల్ మనుషులు ప్లాన్ చేస్తున్నట్టు ముందుగానే తెలుసన్నారు.

 గల్ఫ్‌లో ఉన్న ఓ స్నేహితుడు తనకు ఈ విషయం చెప్పి హెచ్చరిస్తూ చోటా షకీల్, ముంబైలోని అతడి అనుచరుడు మాట్లాడుకున్న సంభాషణ రికార్డును తనకు పంపినట్టు తెలిపారు. కాగా, తారెఖ్ ఫతాను హత్య చేసేందుకు కుట్ర పన్నిన చోటా షకీల్ అనుచరుడు జునైద్ చౌదరీ (21)ని ఢిల్లీ పోలీసులు ఈ నెల 7 రాత్రి అరెస్ట్ చేశారు. ఫతా ప్రస్తుతం ఢిల్లీలో లేకపోయినప్పటికీ ఆయనను చంపేందుకు జునైద్ రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఫతాను చంపేందుకు జునైద్ రూ.1.5 లక్షలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News