: ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామమంటే.. పాక్ రాయబారి అందరి ముందు ఫక్కున నవ్వేశాడు!

పాకిస్థాన్ అత్యున్నత దౌత్యాధికారి ఒకరు వాషింగ్టన్‌లో అందరి ముందు ఫక్కున నవ్వేశారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామం కాదని పదేపదే పేర్కొన్న ఆ దేశ దౌత్యాధికారి ఐజాజ్ అహ్మద్ చౌదరి అందరి ముందు నవ్వుతూ ఆ విషయాన్ని చెప్పడం గమనార్హం. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు స్థానం లేదని పేర్కొన్న ఐజాజ్ తాలిబన్లు ఎప్పుడూ ఆఫ్ఘనిస్థాన్ విడిచి పాక్‌లో అడుగుపెట్టలేదన్నారు.

అమెరికా మాజీ దౌత్యాధికారి జలమయ్ ఖలిల్‌జాద్ మాట్లాడుతూ ముల్లా ఒమర్ పాక్‌లో తిరిగినట్టు, అక్కడే నివసించినట్టు, ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందన్నారు. ఆయనతో పాటు భారత మాజీ మంత్రి మనీష్ తివారీ, టాప్ అమెరికన్ థింక్ ట్యాంక్ నిపుణుడు ఆష్లీటెల్లిస్‌లు కూడా ఖలిల్‌జాద్‌‌కు మద్దతు పలకడంతో పాక్ దౌత్యాధికారి ఐజాజ్ దాదాపు ఒంటరివారయ్యారు.

దీంతో సహనం కోల్పోయిన ఐజాజ్ వాషింగ్టన్ థింక్-ట్యాంక్ ఆడియన్స్ ముందు ఒక్కపెట్టున నవ్వేశారు. టెర్రరిస్టులకు పాక్ స్వర్గధామం కాదని పదేపదే చెప్పుకొచ్చారు. ‘‘ఇది నిజంగా హాస్యాస్పదం’’ అంటూ కొంత అసహనం ప్రదర్శించారు. తాలిబన్ నేత ముల్లా ఒమర్ ఎప్పుడూ ఆఫ్ఘనిస్థాన్ విడిచి పాక్‌ రాలేదని నొక్కి చెప్పారు. నిజానికి ముల్లా ఒమర్ కరాచీలోని ఓ ఆస్పత్రిలో చనిపోవడం గమనార్హం.

More Telugu News