: ఎవరైనా సరే తనకు అణిగిమణిగి ఉండాల్సిందేనని ట్రంప్ ఆదేశించారు!: ఉద్వాసనకు గురైన ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామే సంచలన సాక్ష్యం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఉద్వాసనకు గురైన ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామే సంచలన ఆరోపణలు చేశారు. ఏడు పేజీల లిఖితపూర్వక వివరణను వెలువరించిన ఆయన, వైట్ హౌస్ లో తాను ట్రంప్ ను కలిసిన వేళ ఎవరైనా తన కింద ఉండాల్సిందేనని ఆయన ఆదేశించినట్టు తెలిపారు. "నాకు విధేయత కావాలి. ఆ విధేయతనే నేను కోరుకుంటున్నా" అని వైట్ హౌస్ లో డిన్నర్ చేస్తున్న వేళ ట్రంప్ తేల్చి చెప్పారని సెనెట్ ఇంటెలిజన్స్ కమిటీకి ఆయన వెల్లడించారు.

గతంలో ఎఫ్బీఐ విచారణలో ఉన్న అన్ని వివాదాల నుంచి తన పేరును తొలగించాలని, అలాగే తన ప్రధాన అనుచరుల పేర్లను తీసివేయాలని ట్రంప్ డిమాండ్ చేసినట్టు తెలిపారు. కాగా, గత నెలలో కామేను తొలగించిన తరువాత, తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ ఖండించిన సంగతి తెలిసిందే. ట్రంప్ అనుయాయులు, రష్యన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయన్న ఆరోపణలపై విచారిస్తున్న ఎఫ్బీఐ నుంచి డైరెక్టర్ ను తొలగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అధ్యక్షుడిని వ్యక్తిగతంగా విచారించబోమని తాను పదే పదే చెప్పాల్సి వచ్చిందని కూడా కామే వెల్లడించారు. మొత్తం తొమ్మిది సార్లు తాను ట్రంప్ ను కలిశానని, కలిసినప్పుడల్లా తాను అసౌకర్యంగా ఫీలయ్యానని వెల్లడించారు.

తనను డిన్నర్ కు పిలిచినప్పుడు పలువురు అతిథులు ఉంటారని భావించానని, కానీ తామిద్దరమే అక్కడ ఉన్నామని ఆయన అన్నారు. గ్రీన్ రూమ్ లోని ఓ చిన్న టేబుల్ ముందు తమ సమావేశం సాగిందని, ఇద్దరు స్టీవార్డులు తమకు ఆహారం, పానీయాలను అందించారని చెప్పారు. ఎఫ్బీఐ డైరెక్టరుగా కొనసాగాలంటే, అణిగి మణిగి ఉండాల్సిందేనని ట్రంప్ స్పష్టంగా చెప్పారని తెలిపారు. మొత్తం మీద కామే ఇప్పుడు సమర్పించిన లిఖితపూర్వక సాక్ష్యం అమెరికాలో ప్రకంపనలు పుట్టిస్తోంది.

More Telugu News