: పోలవరంలో మరో మహత్తర ఘట్టం... కాపర్ డ్యాం పనులు ప్రారంభం!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక మైలురాయి పడింది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాపర్ డ్యామ్ పనులను సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. డ్యామ్ వద్ద లోతైన గుంతలు తీసే మెషీన్ కు టెంకాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, డయాఫ్రం వాల్ పనులు ఈ సీజన్ లోనే 50 శాతం వరకూ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. 48 గేట్ల పనులు అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 4 వేల మంది నిత్యమూ శ్రమిస్తున్నారని, వారి కష్టంతో నవ్యాంధ్ర వాసుల కల నెరవేరే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. రోజువారీ, నెలవారీ, సీజన్ వారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామన్నారు.

ఈ సంవత్సరం ఏరువాక అనుకున్న సమయానికి సాగుతుందని, వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండటం శుభపరిణామమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే, కావాల్సినంత నీరు ఇక్కడి నుంచే లభిస్తుందని అన్నారు. ఈ నీటితో కృష్ణా జిల్లాకు మరింత సాగు, తాగు నీటిని అందిస్తామని, ఆ మేరకు మిగిలే కృష్ణానది నీటిని రాయలసీమకు పంపించి రతనాల సీమను చూపిస్తామని చంద్రబాబు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు పోలవరం స్పిల్ వే క్రస్ట్ గేట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, మరింత వేగంగా మిగిలిన పనులను పూర్తి చేసి అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఐకానిక్ బ్రిడ్జి పనులకు సంబంధించిన పైలాన్ ను కూడా చంద్రబాబు ఆవిష్కరించారు.

More Telugu News