: 16 నుంచి దేశ వ్యాప్తంగా రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలు

బులియన్ మార్కెట్ తరహాలో ఇకపై పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ ధరలను నిర్ణయిస్తూ విశాఖపట్టణం, పుదుచ్చేరి, ఉదయ్ పూర్, ఛండీగడ్, జంషెడ్ పూర్ లలో ప్రయోగాత్మకంగా పెట్రోలు, డీజిల్ లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని పెట్రోలియం కంపెనీల కన్సార్టియం కేంద్రానికి ప్రతిపాదించడంతో కేంద్రం సరే అంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా ఈ సరికొత్త ధరల విధానం అమలు కానుంది. ఈ విధానంలో అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారతాయి.

ఇప్పటి వరకు పక్షం (15) రోజులకోసారి పెట్రోలియం కన్సార్టియం సమావేశమై ధరల పెంపు లేదా తగ్గింపు నిర్ణయం తీసుకునేది. ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు లాభాల బాటపడుతున్నప్పటికీ... కొన్ని సార్లు మాత్రం నష్టం వస్తోందని పెట్రోలియం కన్సార్టియం (ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌) కేంద్రానికి తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త పెట్రోలు ఉత్పత్తుల అమ్మకం విధానానికి తెరతీసింది.

More Telugu News