: చక్రం తిప్పుతున్న దినకరన్.. మళ్లీ హైడ్రామాను తలపిస్తున్న తమిళ రాజకీయాలు!

తమిళనాడు రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు చిన్నమ్మ శశికళ, దినకరన్ లను ఏఐఏడీఎంకే పార్టీకి దూరం చేయడానికి ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రయత్నిస్తున్నారు. అలాగే, వీరిద్దరినీ పార్టీ నుంచి వెలివేయాల్సిందేని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో, బెయిల్ పై బయటకు వచ్చిన దినకరన్ కూడా మళ్లీ తన హవా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఊహించని విధంగా అతనికి ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుండటం గమనార్హం.

నిన్న రాత్రి వరకు దినకరన్ కు 24 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి వర్గంలోని 123 మంది ఎమ్మెల్యేలలో 24 మంది జారుకున్నట్టు అయింది. సోమవారం రాత్రి చెన్నైలోని తన నివాసానికి దినకరన్ చేరుకునే సమయానికి అతనికి అండగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 10 మాత్రమే. ఒక్క రోజులోనే మరో 14 మంది ఆయన పంచన చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పరిణామాలతో పళని వర్గంలో ఆందోళన మొదలైంది. మరికొంత మంది ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇస్తే... పార్టీ మొత్తం దినకరన్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చాలా సంతోషంతో ఉన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే... అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.

More Telugu News