: పెళ్లి చేసుకుని స్వర్గం చూపిస్తానంటే, నమ్మి రూ. 14 లక్షలు సమర్పించుకున్న మహిళా టెక్కీ!

బ్రిటన్ లో వైద్యుడిగా పని చేస్తున్నానని, లక్షల్లో డబ్బు వస్తోందని, తనను వివాహం చేసుకుంటే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని చెబితే, నమ్మిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ మోసానికి గురైంది. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, మల్కాజ్ గిరి ప్రాంతంలో నివసించే ఓ యువతి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తోంది. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో పలు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో ఆమె ఖాతాలు తెరవగా, గత ఫిబ్రవరిలో డాక్టర్ సుమంత్ భారత్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. తన పూర్వీకులు ఇండియన్స్ అని, యూకేలో పుట్టి పెరిగి, డాక్టర్ గా పని చేస్తున్నానని అతడు చెప్పుకున్నాడు. అతని ప్రొఫైల్ నచ్చడంతో ఆమె వివాహానికి అంగీకరించింది.

త్వరలో తన సోదరి, ఆమె కుమారుడిని తీసుకుని ఇండియాకు వస్తున్నానని, వీసా ఖర్చుల కోసం భారత కరెన్సీ కావాలని కోరితే, ఆ డబ్బును అతని ఖాతాలో జమ చేసింది. తాను మిలియన్ డాలర్లు పంపుతున్నానని, వాటిని తీసుకోవాలని ఆ మోసగాడు చెప్పిన మాటలు నమ్మింది. ఆపై రెండు రోజుల తరువాత ఢిల్లీ ఎయిర్ పోర్టులో తాను కస్టమ్స్ ఆఫీసర్ నని చెబుతూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ పేరిట ఓ పార్సిల్ వచ్చిందని, దానిలో యూకే పౌండ్లు ఉన్నాయి కాబట్టి,  కస్టమ్స్‌ క్లియరెన్స్‌ టాక్స్‌ తదితరాల కోసం డబ్బులు కట్టాలని చెబుతూ, పార్సిల్ ఫోటోలు పంపాడు. దాన్ని కూడా నమ్మిన బాధితురాలు దశలవారీగా రూ. 14 లక్షలను జమ చేసింది. ఎన్ని రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోవడం, ఆ అధికారి స్పందించక పోవడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది.

ఓ నైజీరియన్ ఈ పని చేశాడని తమ దర్యాఫ్తులో గుర్తించిన పోలీసులు, ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా పనిచేసిన రషీద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 10 శాతం కమిషన్ పై రషీద్ పని చేస్తున్నాడని, ప్రధాన నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News