: తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం క‌ల‌క‌లం!

కాదేదీ న‌కిలీ చేయ‌డానికి అన‌ర్హం.. అన్న‌ట్లు వ్యాపారులు చెల‌రేగిపోతున్నారు. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ గుడ్లు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం బ‌య‌ట ప‌డింది. ప్లాస్టిక్ రైస్ అమ్మ‌కాల‌పై ఇరు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైద‌రాబాద్‌, శ్రీ‌శైలం స‌హా ప‌లు ప్రాంతాల్లో ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని, ఈ రోజు ప‌లుచోట్ల దాడులు చేస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రైస్ బ‌స్తాల‌ను సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వ్యాపారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.  

హైద‌రాబాద్‌లోని మీర్ పేట్‌లో ప్లాస్టిక్ బియ్యం క‌ల‌క‌లం రేపింది. రెండు నెల‌లుగా అశోక్ అనే ఓ వ్య‌క్తి ఇంట్లో ప్లాస్టిక్ బియ్యాన్నే వండుకుని తిన్నారు. తాము తింటున్న‌ది ప్లాస్టిక్ బియ్యం అన్న సంగ‌తిని వారు చాలా ఆల‌స్యంగా గుర్తించారు. తాము రెండు నెల‌లుగా ఇదే బియ్యాన్ని తింటున్నామ‌ని అశోక్ మీడియాకు చెప్పారు. అన్నం తిన్న తర్వాత తమ ఇంట్లోవారికి క‌డుపు ఉబ్బిపోతోంద‌ని, ఆసుప‌త్రికి కూడా వెళ్లామ‌ని, ట్యాబ్లెట్లు వేసుకుంటే త‌గ్గుతోంది కానీ, మ‌ళ్లీ అనారోగ్యం ‌పాలు అవుతున్నామ‌ని చెప్పారు. నిన్న రాత్రి అన్నం లేటుగా ఉడికిందని, చివరికి అది మెత్తగా ఉండ‌డం చూసి దానిపై అనుమానం వ‌చ్చింద‌ని చెప్పారు. అన్నం ముద్ద‌ను నేలకేసి కొడితే అది బంతిలా ఎగిరింద‌ని అన్నారు. దీంతో ఆయ‌న ఈ రోజు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వ్యాపారులు త‌మ లాభాల కోసం ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాట‌మాడుతున్నారని ఆయ‌న అన్నారు.                 

More Telugu News