: టెక్కీలకు శుభవార్త... ఉద్యోగులను తీసివేయడం లేదన్న ఇన్ఫీ, జీతాలు పెంచామన్న విప్రో

పెరుగుతున్న ఆటోమేషన్, ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ఏ క్షణాన ఉద్యోగం ఊడిపోతుందోనన్న భయాందోళనలో ఉన్న ఐటీ ఉద్యోగులకు దిగ్గజ సంస్థలు శుభవార్త వినిపించాయి. తమ ఉద్యోగులకు వేతనాలు పెంచామని, పెంచిన వేతనాలు జూన్ నుంచే అమలవుతాయని విప్రో ప్రకటించగా, ఈ సంవత్సరం ఏ ఉద్యోగినీ తొలగించబోవడం లేదని ఇన్ఫోసిస్ పేర్కొంది.

ఆన్ సైట్ ఉద్యోగులకు 10 శాతానికి లోపుగానే ఇంక్రిమెంట్ ఉంటుందని, ఇక విదేశాల్లో పనిచేస్తున్న పక్షంలో వారి వారి భౌగోళిక ప్రాంతాలను బట్టి జీతాలను పెంచామని, పనితీరులో ప్రతిభను కనబరిచిన వారికి రివార్డులు సైతం ఇవ్వనున్నామని విప్రో పేర్కొంది. ఇదే సమయంలో ఉద్యోగులను తొలగించబోవడం లేదని చెప్పిన ఇన్ఫోసిస్, వేతనాల పెంపును వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది. తమ సంస్థలోని ఆన్ సైట్, ఆఫ్ షోర్ ఉద్యోగులకు జూలై 1 నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

కాగా, గడచిన ఆర్థిక సంవత్సరంలో విప్రో ఆదాయం 4.7శాతం మేరకు తగ్గింది. ముఖ్యంగా జనవరి - మార్చి త్రైమాసికంలో ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఆ ప్రభావం పూర్తి ఫలితాలపై కనిపించింది. సంస్థ చైర్మన్ అజీం ప్రేమ్ జీ గత సంవత్సరం ఎలాంటి కమిషన్ నూ అందుకోలేదు. మొత్తం మీద ఆయన వేతనం 63 శాతం తగ్గి రూ. 79 లక్షలను మాత్రమే తీసుకున్నారని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

More Telugu News