: జిహాద్‌లో చేరని ఇండియన్ ముస్లింలు ప్రపంచానికే సిగ్గుచేటు..: అల్‌ఖాయిదా నేత జకీర్ మూసా తీవ్ర వ్యాఖ్యలు

హిజ్బుల్ మాజీ కమాండర్ జకీర్ మూసా అల్‌ఖాయిదాలో చేరిన తర్వాత తొలిసారిగా విడుదల చేసిన ఓ ఆడియో సందేశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇస్లామిక్ జిహాద్‌లో చేరని భారతీయ ముస్లింలు ప్రపంచానికే సిగ్గుచేటు అని అందులో వ్యాఖ్యానించాడు. ఆడియో టేపులోని గొంతు మూసాదేనని భారత అధికారులు ధ్రువీకరించారు. కశ్మీర్‌లో ఇటీవల జరుగుతున్న ఘటనలను ‘అట్రాసిటీ’లుగా పేర్కొన్న మూసా.. యుద్ధం ఒక్క కశ్మీర్‌కే పరిమితం కాలేదని, ఇది ఇస్లాంకు, నాస్తికత్వానికి మధ్య పోరని అభిర్ణించాడు. మూసా తొలి సందేశమైన ఈ ఆడియో టేప్ ప్రస్తుతం ‘టెలిగ్రామ్’, ‘వాట్సాప్’ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది.

బిజ్నోర్ రైలులో ఓ ముస్లిం మహిళపై ఓ పోలీస్ కానిస్టేబుల్ అత్యాచారం, గోరక్షకులు ముస్లింలపై తెగబడుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికైనా భారత ముస్లింలు జిహాద్ లో చేరకపోవడం సిగ్గు చేటన్నాడు. ముస్లింలుగా చెప్పుకునేందుకు వారు సిగ్గుపడాలన్నాడు. మన అక్కాచెల్లెళ్లు దాడులకు గురవుతున్నా, వారిని బాధిస్తున్నా భారతీయ ముస్లింలు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం సిగ్గుచేటన్నాడు. ‘ఇస్లాం అంటే శాంతి’ అని చెప్పడానికి సిగ్గుపడాలని మూసా తీవ్రస్థాయిలో పేర్కొన్నాడు. కాగా, మూసా విడుదల చేసిన టేప్‌లో అల్‌ఖాయిదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ చిత్రాలు, ఇంగ్లిష్, ఉర్దూలో ఉన్న ఇస్లామిక్ కోట్స్ కనిపించాయి.

More Telugu News