: నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు: రాహుల్ కు చంద్రబాబు సమాధానం

ప్రస్తుతం దేశంలో తాను సీనియర్ నాయకుడినని, ఎవరికీ తాను భయపడాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ఈ రోజు ఆయన మాట్లాడుతూ, మనకు నిధులు కావాలి కనుకనే, కేంద్రాన్ని గౌరవిస్తున్నానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు కుట్రకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. 2018 నాటికి ‘పోలవరం’ ద్వారా నీరు విడుదల చేస్తామని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు.

పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నామని, పిడుగుల సమాచారం తెలుసుకునేందుకు ఇస్రో సాయంతో ఒక యాప్ ను రూపొందించామని, ఈ యాప్ ద్వారా 45 నిమిషాల ముందే పిడుగుపడే సమాచారం తెలుస్తుందని అన్నారు. కాగా, ‘ప్రత్యేకహోదాకు భరోసా’ పేరిట నిన్న గుంటూరులో జరిగిన సభలో సీఎం చంద్రబాబుపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి చంద్రబాబు భయపడుతుండటం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడగటం లేదని రాహుల్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతూ చంద్రబాబు ఘాటు కౌంటర్ ఇవ్వడం గమనార్హం. 

More Telugu News