: రాజకీయ ప్రముఖులను బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడి అరెస్టు

ఫైనాన్స్ సెక్రటరీనంటూ రాజకీయ ప్రముఖులకు ఫోన్లు చేసి వారిని బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడిని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పీఏ ఫిర్యాదు మేరకు వలపన్ని మరీ ఘరానా మోసగాడిని అరెస్టు చేశారు. ఫైనాన్స్ సెక్రటరీనంటూ రాజకీయ ప్రముఖులకు ఫోన్లు చేసి, ప్రభుత్వ పథకాల నుంచి డబ్బు ఇప్పిస్తానని వారికి చెబుతుండేవాడు.

 ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద భారీగా నిధులు వచ్చాయని, మీరంటే అభిమానం, మీ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యేలకు సదరు మోసగాడు ఫోన్లు చేస్తుండేవాడని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ‘మీరు కొంత నిధులు ఇస్తే, మొత్తం నిధులు విడుదల చేయిస్తాను’ అని చెబుతూ మోసాలకు పాల్పడేవాడని చెప్పారు. ఘరానా మోసగాడి బారిన పడిన నేతల్లో తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఉన్నారు.

ఘరానా మోసగాడి గురించి చెప్పాలంటే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యక్తి బాలాజీ అలియాస్ దేవర కుమార్. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేవీఐసీ) పేరిట తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులను మోసం చేశాడు. తాను మహబూబ్ నగర్ జెడ్పీ సీఈవో, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని అంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బాలాజీ ఫోన్ చేశాడు. ప్రధాన మంత్రి కృషి యోజనలో భాగంగా రెండు కోట్లు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డికి చెప్పాడు. మే 31వ తేదీలోగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ ఫోన్ కాల్ పై రేవంత్ కు అనుమానం వచ్చింది. ఈ విషయమై తన పీఏకు చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని ఈ రోజు అరెస్టు చేశారు.

More Telugu News