: నేల మీదే కూర్చుంటా... ప్రత్యేక ఏర్పాట్లు వద్దు: యోగి

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పర్యటనలు, సభలు, సమావేశాల్లో సైతం భారీ ఎత్తున ఏర్పాట్లు ఉంటాయి. ప్రజలంతా ఎలాంటి బాధల్లో ఉన్నా... వీరి జీవితం మాత్రం విలాసవంతంగానే గడిచిపోతుంటుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కూడా అధికారులు ఇలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు. దీంతో, పేరుకు యోగి... అయినా, విలాసవంతంగా ఉంటున్నారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల అమరుడైన ఓ బీఎస్ఎఫ్ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు యోగి వారి ఇంటికి వెళ్లారు. యోగి వస్తున్న నేపథ్యంలో జవాను ఇంట్లో కార్పెట్, సోఫాను అధికారులు ఏర్పాటు చేశారు. యోగి వెళ్లిపోగానే వాటిని అధికారులు తొలగించి, తమతోపాటు తీసుకెళ్లిపోయారు. ఆయన ఎక్కడకు వెళ్లినా అధికారులు ఇలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు.

ఈ విలాసవంతమైన ఏర్పాట్లపై విమర్శలు వస్తుండటాన్ని యోగి గుర్తించారు. వెంటనే అధికారులకు ఆసక్తికరమైన ఆదేశాలను జారీ చేశారు. పథకాల ప్రారంభోత్సవాలు, తనిఖీలు, పర్యటనలకు తాను వెళ్లినప్పుడు తనకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని ఆయన ఆదేశించారు. 'నేల మీద కూర్చునే మామూలు వ్యక్తుల్లో నేను కూడా ఒక్కడిని' అని ఆయన అన్నారు. 

More Telugu News