: టీమిండియా తరువాతి కోచ్ వీరేంద్ర సెహ్వాగ్?

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమిండియాతో కొనసాగేందుకు అనిల్ కుంబ్లే అంగీకరించలేదా? అంటే అవుననే మీడియా కథనాలు చెబుతున్నాయి. పోనీ కనీసం బీసీసీఐ సలహా సంఘం, మాజీ సహచరులు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ తో సమావేశమయ్యేందుకు కూడా సిద్ధంగా లేడా? అంటే లేడనే సమాధానం వినిపిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా కొత్త కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ను నియమించే అవకాశం కనిపిస్తోందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సెహ్వాగ్ కు కోచింగ్ లో పెద్దగా అనుభవం లేనప్పటికీ...ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

 విదేశీ కోచ్ కంటే వీరూ అయితే జట్టులో ఆటగాళ్లతో బాగా కలిసిపోయే అవకాశం ఉందని, అలాగే తన అభిప్రాయాలను చాకచక్యంగా చెప్పే సామర్థ్యం కూడా వీరూకి ఉందని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కుంబ్లేకు జట్టుతో కొనసాగే అవకాశం లేకపోతే... ఆటగాళ్లతో విభేదాలు ఉంటే... గతంలో ఆటగాళ్లు, కెప్టెన్ రెమ్యూనరేషన్ పై బీసీసీఐతో వివాదానికి ఎందుకు దిగుతాడు? జట్టు ఎంపికలో ఎందుకు భాగస్వామ్యం కోరుతాడు? అలాగే సుదీర్ఘ కాలం సహచరులుగా మెలగిన సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ను కలిసేందుకు, పరిస్థితి వివరించేందుకు ఉన్న అభ్యంతరం ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. మొత్తానికి సెహ్వాగ్ టీమిండియా తరువాతి కోచ్ అంటూ వార్తలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి.

More Telugu News